Ambati Rambabu : ఏపీ రాజకీయంగా ఏ చిన్న డెవలప్‌మెంట్ జరిగినా సెన్సేషన్ అవుతోంది. అందుకు కారణం.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, మరోవైపు జనసేన కార్యకర్తలు, నేతలు రాజకీయంగా దూకుడుగా వ్యవహరించడమే. సోషల్ మీడియాలోనూ మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రేపో మాపో ఎన్నికలు వచ్చేస్తాయన్న రీతిలో వీరి వ్యవహారం సాగుతోంది.
తాజాగా గుంటూరు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముతున్నారంటూ జనసేన పార్టీకి చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కలకలం రేగుతోంది.
జనసేన నేతలు అంబటి రాంబాబుపై చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. అందుకు కారణం.. పవన్ కల్యాణ్‌ను అంబటి రాంబాబు విపరీతంగా విమర్శిస్తుండడమే. సత్తెనపల్లిలో సభ నిర్వహించిన పవన్ కల్యాణ్.. శవాలపై చిల్లర ఏరుకొనే రకం.. అంటూ అంబటిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనికి ఉదాహరణగా.. ఇద్దరు బాధితులు పరిహారం చెక్కు మంజూరైతే రెండున్నర లక్షల వాటా అడిగారని మీడియాకు ఎక్కారు. ఈ ఘటన తర్వాత జనసేన వర్సెస్ అంబటి రాంబాబుగా అక్కడ పరిస్థితి తయారైంది.
కోర్టును ఆశ్రయించిన జనసేన నేత..
తాజాగా సత్తెనపల్లిలో వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా కలకలం రేపింది. ప్రజలకు స్వయంగా మంత్రి అంబటి లాటరీ టికెట్లు అమ్మతున్నారని జనసేన నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారే లక్ష్యంగా ఈ తంతు సాగుతోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
దీనిపై సత్తెనపల్లి పోలీసులు స్పందించకపోవడంతో జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రచార వీడియోలు కూడా కోర్టుకు సమర్పించారు. రాష్ట్రంలో లాటరీ వ్యాపారానికి అనుమతి లేదని గుర్తు చేశారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇందుకు మంత్రి అంబటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన కోర్టు.. అంబటిపై కేసు పెట్టి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది.
Also Read:
Telangana New CS : తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి.. ఆమె ప్రొఫైల్ తెలుసా?