ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వాలు మారినా అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి అప్పులు చేయడంలో పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. రోజురోజుకూ సంక్షేమం పేరిట అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పులు చేయడం ఏటా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు గుదిబండగా మారాయి.
తాజాగా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై కేంద్రం వివరాలు వెల్లడించింది. మరోసారి అప్పుల చిట్టాను బయటపెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ. అప్పులు దాదాపు రెండింతలయ్యాయని తెలుస్తోంది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోయే సరికి 2019 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉంది. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022లో సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉందని కేంద్రం వెల్లడించింది. అంటే ఏటా సుమారు రూ.45,000 కోట్లు అప్పులు చేస్తోందని పంకజ్ చౌదరి వివరించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం పది లక్షల కోట్లకు అప్పులుచేరాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. సంక్షేమం పేరుతో అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారంటూ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడుతున్నారు. ఓవైపు రాజధాని అభివృద్ధి చేయక, పరిశ్రమలు దూరమవుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు అటు వైసీపీ శ్రేణులు మాత్రం.. టీడీపీ నిర్వాకం వల్లే రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
also read news:
kiraak RP : నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు.. కిరాక్ ఆర్పీ కామెంట్స్