Telugu Moms Network : తెలుగు అమ్మలకు ఒకప్పుడు, ఇంట్లో పిల్లలకు ఏదో చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందంటే వెంటనే ఆ తల్లికి ఇంట్లో ఉన్న అత్తమ్మో, ఆ అత్తమ్మకు అత్తమ్మో, పక్కింటి బామ్మ గారో, ఎదురింటి పిన్ని గారో, వెనకింటి వదిన గారో సలహాలు ఇచ్చేవారు, మాట సాయం చేసేవారు.
మరి ఇప్పుడు , ఆ తల్లి తను భాగం అయిన ఒక ఫేస్ బుక్ కమ్యూనిటీ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. వెంటనే అక్కడెక్కడో దేశ రాజధానిలో ఉండే ఒక అమ్మ ఏమి చెయ్యాలో చెప్తుంది, పక్క రాష్టంలో ఉండే మరో అమ్మ ధైర్యం చెప్తుంది, సప్త సముద్రాలు దూరాన ఉన్న ఇంకో అమ్మ మరో సలహా ఇస్తుంది, అదే ఊరిలో మరో చివరన ఉండే అలాంటి వయస్సులోనే పిల్లలు ఉన్న మరో అమ్మ తనకి తెలిసిన మంచి డాక్టర్ గురించి సమాచారం ఇస్తుంది. ఇలా ఇంతమంది సలహాల మధ్యలో ఆ తల్లి తను ఒంటరిగా ఉన్నాననే భావన పోయి ఆ సమస్యను దైర్యంగా ఎదుర్కొంటుంది.
ఇదంతా ఏదైనా యాడ్ లో స్త్రీల సాధికారత గురించి ప్రమోషన్ అనుకుంటున్నారా? కాదు ఇదంతా గత నాలుగు సంవత్సరాలు నుండి నిజంగా అచ్చంగా మన తెలుగు అమ్మల కోసమే మొదలుపెట్టిన ఫేస్ బుక్ కమ్యూనిటీలో నిత్యం జరిగే విషయం.
ఆ కమ్యూనిటీ లేదా గ్రూప్ పేరే ‘ తెలుగు మామ్స్ నెట్వర్క్’ (Telugu Moms Network) మన తెలుగింటి అమ్మ శ్రీమతి ప్రదీప్తి విసంశెట్టి (pradeepthi vissamsetti) గారు 2019లో తన ఈ కమ్యూనిటీని మొదలుపెట్టారు. తనతో మొదలైన ఈ కమ్యూనిటీలో ఇప్పుడు 27వేల పైగా అమ్మలు ఉన్నారు.
అయితే ఏముంది ఫేస్బుక్ లో ఇలాంటి కమ్యూనిటీలు లక్షల కొద్దీ ఉన్నాయి కదా అనుకుంటున్నారా? అయితే ఈ కమ్యూనిటీ ఇటీవలే సాధించిన ఒక ఘనత గురించి మనం చెప్పుకోవాల్సిందే.
ఫేస్ బుక్ ఆక్సిలేటర్ ప్రోగ్రాం
ఫేస్ బుక్ గత సంవత్సరం నుండి కమ్యూనిటీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘ఫేస్ బుక్ ఆక్సిలేటర్ ప్రోగ్రాం’ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్ని లక్షల కమ్యూనిటీల నుండి కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసుకుని ఆ కమ్యూనిటీ అడ్మిన్స్ కు 4 నెలల పాటు ఈ ప్రోగ్రాం క్రింద వారికి చాలా విషయాలలో ట్రైనింగ్ ఇస్తుంది.
ఈ సంవత్సరం అలా కొన్ని లక్షల కమ్యూనిటీలలో ప్రపంచ వ్యాప్తంగా 150 కమ్యూనిటీలను ఫేస్ బుక్ ఎంపిక చేసింది. మన దేశంలో 15 కమ్యూనిటీలకు ఆ అవకాశం దక్కింది.
అయితే దక్షిణాదిలో ఆ అవకాశం వచ్చిన ఏకైక కమ్యూనిటీ మన “తెలుగు మామ్స్ నెట్వర్క్” సింపుల్ గా TMN అని గర్వంగా చెప్తునే ఈ కమ్యూనిటీ తనకు మూడో బిడ్డ అంటారు ఫౌండర్ ప్రదీప్తి.
ఒక అమ్మే మరొక అమ్మను బాగా అర్థం చేసుకుంటుంది అంటారు అందుకేనేమో ఇద్దరి పిల్లల తల్లైన ప్రదీప్తిగారు ఈ కమ్యూనిటీని మొదలుపెట్టి ఎంతోమంది తల్లులకు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.
Telugu Moms Network ఎలా మొదలయ్యిందంటే ?
MCA అయిపోయాక పెళ్లి ఆ తర్వాత పాప పుట్టాక ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో 5 ఏళ్లు పనిచేశారు ప్రదీప్తి. ఆ తర్వాత రెండోసారి గర్భం దాల్చడం ఆపైన ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడం ఉద్యోగానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది.
ఆ పైన కొన్ని నెలలు ఫ్రీలాన్సర్ గా చేశారు ఆ క్రమంలోనే తన తల్లి మరియు ఒక సైకాలజిస్ట్ అయిన శైలజ విసంశెట్టి గారితో కలిసి సహజ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు.
ఈ TMN కమ్యూనిటీ 2019 సెప్టెంబర్ లో మొదలైంది. అప్పటి నుండి సరికొత్తగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరెంతో మంది అమ్మలకి అండగా నిలబడి చాలా మంది అమ్మలని entrepreneurs గా చేశారు ప్రదీప్తి.
సమన్వయం ఎలా ?
ఒక పది మంది ఉంటేనే కష్టం అలాంటిది ఇంతమంది అమ్మలను ఎలా సమన్వయం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏరోజుకారోజు అంశం ముందే గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి కనపడేలా పోస్ట్ పిన్ చేశారు. అందరూ అదే పద్ధతిని అనుసరిస్తారు.
సోమవారం ఆరోగ్యం, మంగళవారం పిల్లల గురించి, బుధవారం తమ తమ వ్యాపారం గురించి ప్రకటనలు చేసుకోవచ్చు, గురువారం ఈ గ్రూప్ పేరుకు తగ్గట్టు కథలు, సాహిత్యం చాలామంది అమ్మలు మంచి రచయత్రులు కూడా అయ్యారు ఈ అంశం గ్రూప్ లో పెట్టాక వారిలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చింది, శుక్రవారం తాము సాధించిన విజయాలు లేదా తమ గురించి తాము చెప్పుకోవచ్చు, శనివారం మొత్తం ఆధ్యాత్మిక విషయాలు గురించి పోస్ట్స్ పెట్టాలి , ఆదివారం మాత్రం సరదాగా పోస్ట్స్ పెట్టచ్చు సినిమా రివ్యూలు, జోక్స్ ఇంకా గ్రూప్ లో ఎవరికైనా థాంక్స్ చెప్పాలన్నా వారి గురించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నా ఆరోజు చేయచ్చు.
అయితే కేవలం పోస్ట్స్ అంటే ఎదో రాశాము అన్నట్టు ఉండవు ఈ 27వేలలో డాక్టర్లు, మానసిక నిపుణులు, డైటీషయన్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ , ఐటి ఉద్యోగులు, టీచర్లు ఇంకా చాలా వృత్తులు వాళ్ళు ఉన్నారు.
ఇంతే కాదు ఇప్పుడు అయితే ఫేస్బుక్ కమ్యూనిటీలో anonymous క్రింద పోస్ట్ చేసే అవకాశం ఉంది కాని అటువంటి ఆప్షన్ లేనప్పటి నుండే ప్రదీప్తిగారు తమ ఐడెంటిటీ తెలియకుండా సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలనుకునే వారికి ‘అనామిక’ ద్వారా ఆ అవకాశం కల్పించారు.
ఇప్పటికే 3 సంవత్సరాలు జరుపుకుని 4 సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ కమ్యూనిటీ ద్వారా మరింతమంది ఎదగాలని కోరుకుందాం.