Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో ప్లేస్‌లో నిలిచిందని హరీష్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 15 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన వంద పడకల ఆస్పత్రి భవనానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం గండిమాసానిపేట్‌లో కొత్తగా కట్టిన బస్తీ దవాఖానాను ఓపెనింగ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. ప్రతిపక్షాల విమర్శలపై దీటుగా కౌంటర్లు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఇక్కడి ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. వాళ్ల విమర్శలను తిప్పికొట్టాలని ప్రజలు, కార్యకర్తలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతి పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోందన్నారు. అదే ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఇది కూడా రెండేళ్ల తర్వాత ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకం మహారాష్ట్రలో ఉందా? బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
ఇలాంటి అంశాల గురించి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్ అంటూ సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. ఎందుకంటే ప్రతిపక్షాలు జూటామాటలతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతల వైఖరిని తప్పుపట్టారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అనేది ఇప్పుడు దేశంలో ట్రెండ్ అవుతోందని పేర్కొన్నారు.
ఇక మహారాష్ట్రలోని అన్నదాతలంతా కలిసి తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను కావాలని పోరాటం చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ కూడా వేసిందని గుర్తు చేశారు. ఇది మనకు దక్కిన గౌరవం కాదా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నట్లు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, చెరువుల అభివృద్ధి, పండిన పంట కొనాలనే సిద్ధాంతం.. వేరే రాష్ట్రంలో ఉన్నాయా? అని అడిగారు. మన రాష్ట్ర పథకాలు బాగున్నాయనే కేంద్రం అనేక అవార్డులుకూడా ఇచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు.
Read Also : Harish Rao : ఆర్థిక సంఘం నిధుల సంగతి ఎందుకు మాట్లాడలేదు? జేపీ నడ్డాపై మంత్రి హరీష్ రావు ఫైర్