MLA Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిక్కుల్లో పడ్డారు. దుబ్బాక శాసనసభ్యుడిగా ఉన్న ఆయనకు ఐఆర్బీ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు టోల్ గేటు లీజు అంశంపై ఆయన చేసిన కామెంట్స్‌పై ఐఆర్బీ డెవలపర్స్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. తమ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారంటూ వెయ్యి కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్బీ సంస్థకు చేసిన టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు గుప్పించారు. దీంతో స్పందించిన ఐఆర్బీ సంస్థ.. రఘునందన్‌రావుపై లీగల్‌గా ప్రొసీడ్ అయ్యింది. ఓఆర్ఆర్ టోల్ గేట్‌ను 30 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న ఐఆర్బీ కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతున్నారని, హత్యలు చేయిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగు రోడ్డు లీజు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఆరోపణలను తోసిరాజని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని రఘునందన్‌రావు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఓఆర్ఆర్ లీజును రద్దు చేయని కారణంగా ఈ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఔటర్ రింగు రోడ్డు టెండరు దక్కించుకున్న సంస్థ రూ.7,272 కోట్లు కోట్ చేసినట్లుగా రఘునందన్‌రావు పేర్కొన్నారు. అయితే, రూ.7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటన చేశారని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని నిలదీశారు.
ఈ సొమ్ము ఎవరిని అడిగి పెంచారంటూ ప్రశ్నలు గుప్పించారు రఘునందన్‌రావు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ సన్నిహితుల కంపెనీకి ఔటర్ రింగు రోడ్డును లీజుకు ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను ఈ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన తెరిచినట్లు ఆయన చెప్పారు. అయితే, ఏప్రిల్ 27వ తేదీన ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రకటన విడుదల చేశారన్నారు. మరోవైపు ఓఆర్ఆర్ నిర్వహణను తెలంగాణ సర్కార్ అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.415 కోట్లు వస్తోందని, ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓఆర్ఆర్ లీజు విషయంలో దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు.
Read Also : Telangana BJP : కేసీఆర్‌ను గద్దె దించుతాం.. అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు