Telugu Flash News

Priyanka Gandhi: హైదరాబాద్‌లో ప్రియాంకా గాంధీ.. యువ సంఘర్షణ సభలో ఏం మాట్లాడారంటే..

Priyanka Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఇవాళ తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్‌ చేరుకున్న ఆమెకు.. రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్‌ నగరంలోని సరూర్‌ నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ యువ సంఘర్షణ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద, డబ్బు అంతా ఎక్కడికి పోతోందని ఆమె ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఇటీవల పొలిటికల్‌గా పర్యటనలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా సోదరుడు రాహుల్‌ గాంధీ చేసిన సుదీర్ఘ పాదయాత్రలో కూడా అమె అప్పుడప్పుడు పాల్గొన్నారు. రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రియాంక.. యువ సంఘర్షణ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకొనేటప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలని ప్రజలను కోరారు.

లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గడచిన రెండు వారాలుగా తాను కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని ప్రియాంక తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రం వాళ్ల జాగీరు అనుకుంటున్నారు.. జీగీర్దార్లు అనుకుంటున్నారు.. అంటూ ప్రభుత్వంపై ప్రియాంక విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జరుగుతుందని అందరూ నమ్మారని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తానని అప్పట్లో కేసీఆర్‌ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ ఇంట్లో ఎవరికైనా జాబ్‌ వచ్చిందా? అని ప్రియాంక ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయన్న ప్రియాంక… వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నలు గుప్పించారు. గత 9 సంవత్సరాల్లో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదేమని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క ప్రభుత్వ వర్సిటీలో కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆరోపించారు. తనను అందరూ ఇందిరమ్మ అంటుంటే తనపై మరింత భారం పెరుగుతోందని ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారని తెలిపారు. ఆమెను గుర్తు చేసుకుంటూ తాను తప్పుడు హామీలు ఇవ్వలేనని చెప్పారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని, తాము సరిగా పని చేయకపోతే తమను కూడా తొలగించాలని ప్రజలను ప్రియాంక కోరారు.

Read Also : Cyclone Mocha: తెలంగాణకు మోచా తుపాన్‌ ఎఫెక్ట్‌.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

Exit mobile version