Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సర్వ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 21 రోజులపాటు వేడుకలు నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టింది ప్రభుత్వం. తాజాగా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారగణాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తాము కూడా నిర్వహిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా వేడుకల నిర్వహణకు సిద్ధం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటను ఎంచుకుంది. జూన్ 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు వైభవోపేతంగా నిర్వహించేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. ఈ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం, పారా మిలటరీ దళాల కవాతు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు.. సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు, నేతలు, శ్రేణులంతా భారీ సంఖ్యలో తరలిరావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఇక తగ్గేదే లే.. అన్నట్లు పరిస్థితి మారింది. తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదని, కేసీఆర్ మాత్రమే వేడుకలు జరపడానికి వీల్లేదని, తాము కూడా నిర్వహిస్తామని కేంద్రం వ్యవహరిస్తుండడంతో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సరైన నాయకత్వం లేకపోవడం, అభ్యర్థులను నిలబెట్టే అంత సీన్ లేకపోవడంతో కచ్చితంగా రెండో స్థానాన్ని అయినా భర్తీ చేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకొనేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. రాష్ట్ర అవతరణ వేడుకలను మామూలుగా అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాలి. అయితే, భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలకు ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. దీంతో ఎవరికి వారు బలప్రదర్శనకు పూనుకుంటున్నారు.
Read Also : CM KCR: దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో ఏం జరిగింది? కేసీఆర్ ప్రశ్న