Telugu Flash News

Telangana Congress : సర్పంచులకు బాసటగా కాంగ్రెస్‌.. ధర్నాకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు!

తెలంగాణలో కాంగ్రెస్‌ (Telangana Congress) పార్టీ ఇటీవల జోరు పెంచినట్లు కనిపిస్తోంది. మునుగోడు సిట్టింగ్‌ స్థానం కోల్పోవడంతో ఇక వచ్చే ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వాలన్నా ప్రజల్లో యాక్టివ్‌గా తిరగడం తప్పనిసరి. అందుకే అధినాయకత్వం గట్టిగా మందలించిన నేపథ్యంలో ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చురుగ్గా తిరుగుతున్నారు. ప్రజా సమస్యలపై అటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బీజేపీపైనా రేవంత్‌ రెడ్డి విరుచుకుపడుతున్నారు.

తాజాగా తెలంగాణలో సర్పంచులకు నిధులు అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొందరు సొంత నిధులు వెచ్చించి పనులు చేయించినా బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు నిధులిచ్చినా కేసీఆర్‌ సర్కార్‌ వాటిని మళ్లించిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. పంచాయతీలకు కాకుండా ప్రభుత్వ ఇతర కార్యక్రమాలకు నిధుల మళ్లింపు జరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగా సర్పంచుల నిధుల అంశంపై కాంగ్రెస్‌ పార్టీ వారికి బాసటగా నిలిచింది.

సర్పంచులకు మద్దతుగా ధర్నా చౌక్‌ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది టీ.పీసీసీ. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొనాలని నిన్న నిర్ణయించుకున్నారు. అయితే, ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. కానీ నిరసన తెలిపి తీరుతామని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ధర్నా చౌక్‌కు బయల్దేరుతున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.

రేవంత్‌రెడ్డి హౌస్‌ అరెస్టు..

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రేవంత్‌ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. సర్పంచుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని రేవంత్‌ తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. సర్పంచులకు మద్దతుగా ఇందిరా పార్క్‌ వద్ద నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులంతా పాల్గొనాలని మల్లు రవి పిలుపునిచ్చారు.

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం త్రిముఖ కోణంలో సాగే చాన్స్‌ కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలో సెకండ్‌ ప్లేస్‌లో ఎవరుండాలో డిసైడ్‌ చేసుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ ఏడాదే ఎన్నికలు ఉండటంతో ఇకపై రాష్ట్రమంతటా ఎన్నికల మూడ్‌ కనిపించనుంది.

also read :

ChandraBabu Naidu: చంద్రబాబు సభల్లోనే ఎందుకిలా మృత్యుఘోష? వైఫల్యం ఎవరిది?

morning breakfast : ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా? కొత్త ఏడాదైనా ప్రారంభించండి.. బెనిఫిట్స్‌ ఇవే!

Exit mobile version