ఏపీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణమన్నారు. ప్రత్యర్ధుల పై కక్ష కట్టి పాలనను విస్మరించారని వ్యాఖ్యానించారు.
మనం చేసిన పాపాలు ఏదో ఒకనాడు మింగుతాయని చెప్పటానికి ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పుకొచ్చారు. జగన్ పై ప్రజలు నమ్మకంతో 151 సీట్లు ఇచ్చారని..ఆయన తప్పు చేయటంతో గద్దె దించారని రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో జరిగిన చిట్ ఛాట్ లో ఏపీ రాజకీయాల పైన మాట్లాడారు. జగన్ వ్యవహార శైలే ఆయన్ను దెబ్బ తీసిందన్నారు. తన వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీలను తిట్టి పంపించారని..వారు ఇతర పార్టీల్లో చేరి గెలిచి వచ్చారని రేవంత్ గుర్తు చేసారు. జగన్ నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయన్నారు. ఫలితంగా రాష్ట్రం పైన ప్రభావం చూపిందని చెప్పారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించాలననే విమర్శల్లో వాస్తవం లేదన్నారు.
చంద్రబాబు తనకు ఫోన్ చేసే స్థాయి కాదన్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు..తన రాజకీయ భవిష్యత్ తనకు ముఖ్యమని రేవంత్ స్పష్టం చేసారు,. ఒక మంత్రి పట్టుబటి..అధికారులను చీవాట్లు పెట్టి జగన్ ఇంటి వద్ద కట్టడాలను కూల్చి వేయించారని రేవంత్ వివరించారు. ఆ మంత్రికి వైవీ సుబ్బారెడ్డి 50 సార్లు ఫోన్ చేసి ఆపించే ప్రయత్నం చేసారని రేవంత్ చెప్పుకొచ్చారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ద్వారా కూడా రాయబారం నడిపారని వివరించారు. జగన్ ఇంటి వద్ద కూల్చివేతల విషయం తనకు తెలిసిన వెంటనే సదరు అధికారిని జీఏడీకి అటాచ్ చేసానని రేవంత్ వెల్లడించారు. తమ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంతో తరహాలో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండదని రేవంత్ స్పష్టం చేసారు. ఏపీతో చర్చించాల్సిన అంశాల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారించుకుంటామని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.