Telugu Flash News

TDP Leaders Arrest : మరో చిట్‌ ఫండ్‌ మోసం.. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్‌

chitfund fraud

TDP Leaders Arrest : చిట్‌ ఫండ్‌ మోసాలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల చర్యలను ముమ్మరం చేసింది. రామోజీరావుకు చెందిన మార్గదర్శి కుంభకోణంపై ఏపీ సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమంగా డిపాజిట్లు సేకరించడంపై చెరుకూరి రామోజీరావును, ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు.

తాజాగా ఏపీలో జగజ్జనని చిట్‌ ఫండ్‌ మోసాలపై సీఐడీ అధికారులు దృష్టి పెట్టారు. అక్రమాలను నిర్ధారించిన సీఐడీ బృందం.. ఇవాళ టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్టు చేశారు. ఇప్పటికే జగజ్జనని చిట్‌ ఫండ్‌ మోసాలపై ఏపీ సీఐడీ విచారణ చేస్తోంది. ఇదే క్రమంలో జగజ్జనని చిట్‌ ఫండ్స్‌ డైరెక్టర్లు అయిన ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి చెందిన వ్యక్తులు చిట్‌ ఫండ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి చిట్స్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జగజ్జనని చిట్‌ ఫండ్‌ మోసాలపై కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌.. సీఐడీకి ఫిర్యాదు చేశారు.

నకిలీ ఖాతాలను సృష్టించి అక్రమాలను పాల్పడుతున్నట్లు, చిట్స్‌ పేరుతో డబ్బు చెల్లింపుల్లోనూ భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు. వీటిపై అన్ని ఆధారాలను సీఐడీకి ఆయన సమర్పించారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్‌ డిక్లరేషన్‌ చేసినట్లుగా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి వివరాలు అందజేశారు.

49 సబ్‌స్రైబర్ల వివరాలను పరిశీలించి ఆధారాలను సమర్పించారు. డాక్యుమెంట్ల మెయింటెనెన్స్‌లో కూడా మోసాలను గుర్తించారు. చిట్‌ ఫండ్‌ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్‌ బిజినెస్‌ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో 1982 చిట్‌ ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. గతేడాది నవంబర్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్‌ విభాగం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మార్చి 16వ తేదీన జగజ్జనని చిట్స్‌తోపాటు అనేక సంస్థల్లో సోదాలు జరిగాయి. తనిఖీల్లో లభించిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE 

 

 

Exit mobile version