తెలంగాణ (telangana) లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ రభస కొనసాగుతూనే ఉంది. మొన్నామధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రభుత్వం.. తమిళిసై ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గవర్నర్ కూడా కాంట్రవర్సీ కామెంట్లు చేయకుండా ఉన్నది ఉన్నట్లు చదివి వినిపించారు. అయితే, తర్వాత నివురుగప్పినట్లుగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మరోసారి బయటపడింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం వెళ్లలేదు. తొలుత ఇన్విటేషన్ వెళ్లినట్లు వార్తలు వచ్చినా ఈ వ్యవహారంలో గవర్నర్ స్పందిస్తేనే గానీ వాస్తవాలు బయటకు రాలేదు. తనకు ఆహ్వానం అందలేదంటూ తమిళిసై స్వయంగా వెల్లడించారు. గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై మాట్లాడుతూ.. పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దేశానికి వచ్చే దేశాధినేతలకు సైతం కలిసే అవకాశాలు ఉంటాయి గానీ.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వాధినేతను కలవలేమని, ఇది దురదృష్టకరమన్నారు.
కొన్ని దేశాలు దగ్గర కావొచ్చుగానీ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మాత్రం కాలేవన్నారు. తనకు సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదంటూ వాపోయారు గవర్నర్. ఓ కుటుంబం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు కాదని చురకలంటించారు. దీంతో గవర్నర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు భగ్గుమన్నారు. తమిళిసై వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు స్పందించారు. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. వందే భారత్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా అని నిలదీశారు.
ఎవరు ఎన్నిసార్లు ప్రారంభించాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఇష్టం అని హరీష్‌రావు చెప్పారు. గవర్నర్‌గా, ఓ మహిళగా తమిళిసైని తాము గౌరవిస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ వ్యవహరించడం బాధ కలిగిస్తోందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయసు పెంపు బిల్లు ఏడు నెలలు ఆపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే రీతిలో రాజకీయం వేడెక్కింది. ఇక బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో జోరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
also read :
Rashmika: రష్మిక మందానతో ఎఫైర్‌పై స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్
Mahesh: ఆ సమయంలో ఎందుకు బతికున్నారా అనిపించింది.. మహేష్ ఎమోషనల్ కామెంట్స్