supreme court judgement on marriage age : వివాహ వయసు గురించి దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పురుషులు, మహిళల వివాహ కనీస వయసు ఒకే విధంగా ఉండాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో పార్లమెంటుకు మాత్రమే చట్టం చేసే అధికారం ఉంటుందని, ఇందులో తామేమీ జోక్యం చేసుకోజాలమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
ఇది పూర్తిగా పార్లమెంటుకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక్కడ చట్టాన్ని మేము చేయలేమని చెప్పింది. రాజ్యాంగానికి తామొక్కరమే రక్షకులం కాదని స్పష్టం చేసింది. పార్లమెంటు కూడా రాజ్యాంగానికి రక్షకురాలేనని తెలిపింది. మహిళల వివాహ వయసు ప్రస్తుతం 18 సంవత్సరాల నుంచి పురుషుల వివాహ వయసు అయిన 21 ఏళ్లకు మార్చాలని పిటిషనర్ కోరుతున్నారని సుప్రీం తెలిపింది. ఈ నిబంధన కొట్టేస్తే మహిళలకు వివాహ వయసే ఉండదని సుప్రీం పేర్కొంది.
చట్ట సవరణ చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, అలా చేయాలని న్యాయస్థానం పార్లమెంటుకు ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అందువల్ల ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు.
మరోవైపు మహిళల వివాహ వయసు కూడా పురుషులతో సమానంగా ఉండాలని చాలా కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం యువతీ యువకులు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉండటంతో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలుస్తోంది. అయితే, పట్టణాల్లోనే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో నేటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.
also read:
Prabhas : చిరంజీవి అడ్డాలో ప్రభాస్ సినిమా షూటింగ్..
Nani : చరణ్‌ని అవమానించేలా మాట్లాడిన నాని.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్