Krishna: నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించారు నట శేఖర కృష్ణ.ఆయనని ఇష్టపడనివాళ్లంటూ ఎవరు లేరు. చెక్కు చెదరని చిరునవ్వు ఆయన పెదవులకే అలంకారం కాగా, నేటికీ ఆయన ఎవరూ అందుకోలేని శిఖరం. సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలచుకున్న ఆ నట శిఖరం నేడు నెలకొరిగింది. ఎంతో మంది హృదయాలను గాయపరిచి తన ప్రస్తానం ముగించింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి, నిజమైన అల్లూరి పోరాటపటిమని చూపించిన నటుడు ఘట్టమనేని కృష్ణ (80) నేడు తెల్లవారుజామున స్వర్గస్తులు అయ్యారు.వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థిస్తూ,వారి కుటుంబసభ్యులకు ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు
ఘట్టమనేని ఫ్యామిలీలో కొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటుండడం అభిమానులని కలవర పరుస్తుంది. విజయ నిర్మల, రమేష్ బాబు, ఇందిరా దేవి కొద్ది నెలల గ్యాప్‌తోనే కన్నుమూయగా, రీసెంట్‌గా కృష్ణ స్నేహితుడు కృష్ణం రాజు కూడా స్వర్గస్తులయ్యారు. ఇలా వరుస మరణాలు కృష్ణని చాలా కుంగదీసాయి. నవంబర్ 13న కృష్ణ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. గత కొద్దిరోజులుగా కృష్ణ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ ఆసుపత్రికి వచ్చినట్టు కాంటేనంటల్ వైద్యులు చెప్పారు.
అయితే కృష్ణని కాపాడడానికి వైద్యులు ఎంతో ప్రయత్నించిన కూడా వారి ప్రయత్నాలు విఫలం కావడంతో కృష్ణ కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. ఎన్నో సినిమాలతో వెండితెరపై ప్రేక్షకులకి పసందైన వినోదం పంచిన కృష్ణ ఇలా హఠాన్మరణం చెందడం అభిమానులని కలవర పరుస్తుంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. టాలీవుడ్ మొట్టమొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో.. ప్రయోగాలకు మారుపేరు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. కృష్ణ పూర్తి పేరు శివరామకృష్ణమూర్తి. 1943 సంవత్సరం మే 31న జన్మించిన కృష్ణ.. 1965లో వెండితెరకు పరిచయం అయ్యారు. 1964 ముందు వరకు చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. ‘తేనె మనసులు’ మూవీతో తెరంగేట్రం చేసి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు.