Cricket: ఈ ఏడాదిలో కొందరు స్టార్ ప్లేయర్స్ ఫామ్‌లేమితో నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు వారు చాలా రోజుల తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చి శతకాలు కొట్టడం ఆయా జట్లకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముందుగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఆసియా కప్‌కి ముందు ఫామ్ లేమితో చాలా ఇబ్బందులు పడ్డాడు. జట్టు నుండి తొలగించాలని కూడా డిమాండ్స్ వచ్చాయి. అందుకు కారణం 2019, నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఇన్నాళ్లకి మళ్లీ 1020 రోజుల తర్వాత సెంచరీ కొట్టాడు. ఆసియా కప్ 2022 సూపర్ 4లో అఫ్గానిస్థాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 61 బంతుల్లోనే 12×4, 6×6 సాయంతో అజేయంగా 122 పరుగులు చేశాడు. ఇకఈ సెంచరీ తర్వాత పరుగులు రాబడుతూనే ఉన్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లోను అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో 118 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 122 పరుగులతో అతడ్ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీకి 113,109,108,100,100 రూపంలో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా కోహ్లీ టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఇక ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ తన వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై ఆడిన వార్నర్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో, తమ 100వ టెస్ట్‌లో సెంచరీ చేసిన రెండో వ్యక్తిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడిన వార్నర్ టెస్టు ఫార్మాట్ లో మూడు సంవత్సరాల సెంచరీ కరవును తీర్చుకున్నాడు. దాదాపు 1089 రోజులతర్వాత శతకం బాదిన వార్నర్ దానిని డబుల్ సెంచరీగా మలచడం విశేషం. డేవిడ్ వార్నర్ 2020 జనవరి 14వ తేదీన భారత్‌పై తన 43వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. దీని తర్వాత అతను 67 ఇన్నింగ్స్‌ల్లో కూడా సెంచరీ చేయలేకపోయాడు.
ఇక టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా కూడా కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పుజారా సెంచరీ చేశాడు. టెస్టుల్లో నిలకడకు మారుపేరైన పుజారా.. మరో సెంచరీ కోసం 1443 రోజులు.. 52 ఇన్నింగ్స్ పాటు వేచి చూడాల్సి రావడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పుజారా శతకంతో అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల వద్ద ఔటైన పుజారా.. సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు.పుజారాకు ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అంతే కాదు దాదాపు నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ బాదడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇది పుజారా కెరీర్‌లో ఫాస్టెస్ సెంచరీగా నిలిచింది.
ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ దాహం తీర్చుకున్నాడు. 2021 జనవరిలో భారత్‌పై 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ తన ఫామ్‌ను కోల్పోయాడు. అనంతరం 2022 జూలైలో స్మిత్ నిరీక్షణ కూడా ముగిసింది. అతని బ్యాట్ సెంచరీని చూసింది. శ్రీలంకపై క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ సెంచరీ సాధించాడు. దీని తర్వాత అతను డబుల్ సెంచరీతో సహా మరో రెండు సెంచరీలు చేశాడు.
ఇక న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కూడా ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. 722 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో శతకం నమోదు చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ తప్పుకున్నాక తొలి మ్యాచ్‌లోనే కేన్ సెంచరీతో మెరిశాడు. విలియమ్సన్ (222 బంతుల్లో 105) పరుగులు చేయగా, 2021 జనవరి తర్వాత ఇదే తొలి శతకం కాగా.. టెస్టుల్లో 25వ సెంచరీ కావడం గమనార్హం.