టీమిండియా వెటరన్ క్రికెటర్, ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik).. గత ఐపీఎల్ సీజన్‌లో ఫినిషర్ పాత్రతో ఆకట్టుకున్నాడు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం చేతులెత్తేశాడు. ఏ ఒక్కమ్యాచ్‌లోనూ ఆశ్చర్యపరిచే ఇన్నింగ్స్ కాదు కదా.. కనీసం ఆశించిన స్థాయిలో కూడా పరుగులు చేయలేకపోయాడు. దీంతో దినేష్ కార్తీక్ కెరీర్, రిటైర్‌మెంట్‌పై మరోసారి చర్చలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే, దినేష్ కార్తీక్‌పై ట్రోల్స్ జోరుగా వస్తున్నాయి. ఆర్సీబీ విజయాల్లో కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్ వెల్, మహ్మద్ సిరాజ్ తప్ప మరే క్రికెటర్ పేరు కూడా వినిపించలేదు.
తాజా ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ అత్యంత చెత్త రికార్డులు నమోదు చేశాడు. ఏకంగా నాలుగు సార్లు వరుసగా డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేష్ కార్తీక్ నిలిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డీకే డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనే డీకే చెత్త రికార్డు క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో 5వ స్థానంలో వచ్చిన దినేష్ కార్తీక్ తొలి బంతికే వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ గోల్డెన్ డక్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా డీకే పేరు తెచ్చుకున్నాడు.
ఒక సీజన్‌లోనే నాలుగుసార్లు డీకే డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన వారిలో 221 ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్ 17 సార్లు డకౌట్ అయ్యి తొలిస్థానంలో నిలిచాడు. రెండో ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ 236 మ్యాచ్‌లలో 16 సార్లు డకౌట్ అయ్యాడు. ఇక మూడో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడైన సునీల్ నరైన్ 96 ఇన్నింగ్స్‌లలో 15 సార్లు డకౌట్ అయ్యాడు. నాలుగో ప్లేస్ మన్‌దీప్ సింగ్‌ది. 98 ఇన్నింగ్స్‌లలో ఎటువంటి పరుగులు చేయకుండా మొత్తం 15 సార్లు డకౌట్ అయ్యాడు. ఇక సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు 185 ఇన్నింగ్స్‌లలో మొత్తం 14 సార్లు డక్ అవుట్ కావడం విశేషం.
మొత్తంగా దినేష్ కార్తీక్ కెరీర్ ప్రమాదంలో పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కామెంట్రీ చేసుకుంటున్న వ్యక్తిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. మొన్నామధ్య టీమిండియాలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తీక్.. తర్వాత నాణ్యమైన ప్రదర్శన చేయలేకపోయాడు. లాస్ట్ సీజన్‌లో మాత్రం ఫినిషర్ రోల్‌లో రెచ్చిపోయిన డీకే.. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు.
Read Also : Virat Kohli: నేను బౌలింగ్ వేసుంటే.. 40 పరుగులకే ఆర్ఆర్ ఫసక్.. కోహ్లీ కామెంట్స్!