Telugu Flash News

Asiana Airlines: అత్యవసర డోర్‌ తెరిచిన ప్రయాణికుడు.. గాల్లోనే తెరుచుకున్న విమానం విండో!

Asiana Airlines: విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. రైలు, బస్సు ప్రయాణాలు చేసిన వారు తొలిసారి విమానం ఎక్కితే ఆ థ్రిల్‌ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇటీవల విమాన ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలో విమానం ఎక్కాలనుకొనే వారికి దడ పుట్టిస్తోంది. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ విమానంలో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటన ప్రయాణికుల్ని బెంబేలెత్తించింది. విమానం గాల్లోకి ఎగిరాక ప్రశాంతంగా ఎవరి సీట్లో వారు కూర్చొని హాయిగా జర్నీ చేస్తుండగ హఠాత్మరిణామం చోటు చేసుకుంది.

దక్షిణ కొరియాకు చెందిన ఆ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా కలవరపాటు మొదలైంది. క్యాబిన్‌లోకి భారీగా గాలులు వీచాయి. ప్రయాణం చేస్తున్నవారంతా బయకంపితులయ్యారు. భారీగా గాలులు రావడంతో చాలా మంది ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్ర గాలులతో కొందరికి శ్వాసకోశ సమస్యలు వచ్చేశాయి.

మరికొందరు ప్రయాణికులకైతే గాయాలు కూడా అయ్యాయి. ఆఖరికి విమానం సురక్షితంగా కిందకి దిగడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి ఏసియానా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఎయిర్‌ బస్‌ ఫ్లయిట్‌ A321 బయల్దేరింది. విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ రెండు నగరాల మధ్య జర్నీ చేయాలంటే సుమారు గంట సమయం పడుతుంది. విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ వ్యక్తి ఎమర్జెన్సీ విండో ఓపెన్‌ చేసేందుకు ట్రై చేశాడు.

తోటి ప్రయాణికులు అతడిని వారించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా అప్పటికే ఆ అత్యవసర ద్వారం తెరిచేశాడు. దీంతో భారీగా గాలులు వచ్చేశాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సీటు బెల్ట్‌ గట్టిగా పట్టుకొని కూర్చుండిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ల్యాండ్‌ అయిన తర్వాత డోర్‌ తీసినట్లు భావించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ చర్యకు పాల్పడటం వెనక అతడి ఉద్దేశం తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Read Also : Hong Kong bumper offer : పర్యాటకులకు హాంకాంగ్‌ బొనాంజా.. ఉచితంగా విమాన టికెట్లు!

Exit mobile version