Telugu Flash News

Somesh Kumar with CM Jagan : వైఎస్‌ జగన్‌తో సోమేష్‌ కుమార్‌ భేటీ.. తుది నిర్ణయం ఏంటంటే!

Somesh Kumar with CM Jagan : తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌.. అనూహ్యంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీకి రిపోర్డు చేశారు సోమేష్‌ కుమార్. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన సోమేష్‌కుమార్‌.. సుమారు గంట పాటు ఆయనతో చర్చించారు. హైకోర్టు తీర్పు, తదుపరి పరిణామాలు, తెలంగాణలో పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, సోమేష్‌ కుమార్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అంటే ఇంకా ఏడాదిపాటు ఆయనకు సర్వీసు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు అనూహ్యంగా తీర్పు ఇవ్వడంతో చేసేదేమీ లేక ఆయన ఏపీ క్యాడర్‌కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయనకు.. ఏపీలో అదే స్థాయిలో పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ ప్రస్తుతం అక్కడ ఇప్పటికే సీఎస్‌ పదవి భర్తీ అయిపోయింది. కేఎస్‌ జవహర్‌రెడ్డిని ఇటీవలే ప్రభుత్వం సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సోమేష్‌కుమార్‌ సీఎస్‌ కంటే తక్కువ స్థాయి క్యాడర్‌ బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా చేరిపోవాలని సోమేష్‌ కుమార్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అందుకే సోమేష్‌ కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకొని రాజీనామా లేఖను ఇవ్వనున్నట్లు సమాచారం.

అత్యధిక కాలం పని చేసిన సీఎస్‌..

మరోవైపు తెలంగాణ కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ శాంతికుమారి నియమితులైన విషయం తెలిసిందే. అయితే, విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ కాలం సీఎస్‌గా పని చేసిన వ్యక్తిగా సోమేష్‌ కుమార్‌ చరిత్రలో నిలిచిపోయారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎస్‌గా రాజీవ్‌ శర్మ సుమారు రెండున్నరేళ్ల పాటు పని చేశారు. అనంతరం ప్రదీప్‌ చంద్ర కేవలం నెల రోజులే సీఎస్‌గా ఉన్నారు. ఎస్పీ సింగ్‌ 13 నెలలు, ఎస్కే జోషి 23 నెలలు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2019 డిసెంబర్‌ 31న సీఎస్‌గా నియమితులైన సోమేష్‌ కుమార్‌ సుమారు మూడేళ్లకు పైగా సీఎస్‌గా పని చేశారు.

also read:

Crimea : రష్యా ఉక్రెయిన్ యుధ్ధంలో ‘క్రిమియా’ కు ఎందుకింత ప్రాధాన్యత?

Rishabh Pant: రిష‌బ్ పంత్ ఆరోగ్యం ఎలా ఉంది..ఐపీఎల్‌లో ఆడ‌తాడా లేదా అనే దానిపై అప్‌డేట్ ఇచ్చిన గంగూలీ

Exit mobile version