Chattisgarh Reservoir: ఛత్తీస్‌గఢ్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఒకరు మతిలేని చర్యకు దిగాడు. తన సెల్‌ఫోన్ రిజర్వాయర్‌లో పడేసుకోవడం ఇందుకు కారణమైంది. ఆ స్మార్ట్ ఫోన్‌ను వెలికితీసేందుకుగానూ సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడేయాలని సిబ్బందిని ఆదేశించాడు.
అధికారి ఆదేశంతో సిబ్బంది ఆ పని చేసేశారు. ఆ నీరంతా వృధాగా పోయింది. కానీ అతడి సెల్ ఫోన్ మాత్రం చిక్కలేదట. సోమవారం నుంచి గురువారం దాకా మూడు మోటార్ల ద్వారా డ్యామ్ నుంచి వాటర్‌ను తోడేశారు.
కంకేర్ జిల్లాలోని కొలిబెడా బ్లాక్‌లో ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్‌కు తన మిత్రులతో కలిసి ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ ఆదివారం పిక్నిక్ వెళ్లాడు. అయితే సెల్ఫీ దిగుతుండగా తన చేతుల్లోంచి స్మార్ట్ ఫోన్ పడిపోయింది.
సుమారు లక్ష రూపాయల విలువైన ఫోన్‌లో ప్రభుత్వ డేటా ఉందని, ఆ ఫోన్ కోసం మొదట ఈతగాళ్లతో అన్వేషించే ప్రయత్నం చేశారు. ప్రయోజనం లేకపోవడంతో ఇక నీటిని తోడేందుకు ఉపక్రమించారు.
కొన్ని ఫీట్ల వరకు నీరు తోడేస్తే సెల్‌ఫోన్ దొరుకుతుందని స్థానికులు చెప్పారని, దీంతో నీటిపారుదల శాఖ అనుమతి తీసుకుని డ్యామ్ నుంచి నీటిని తోడేసేందుకు సిద్దమైనట్లు రాజేశ్ తెలిపాడు. ఘటనపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారి రాజేశ్‌ను సస్పెండ్ చేశారు.
Read Also : Back Pain: 2050 నాటికి 80 కోట్ల మందికి నడుంనొప్పి! లాన్సెట్ నివేదికలో వెల్లడి!