Singapore : మనదేశంలో గంజాయి అక్రమ రవాణా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు డ్రగ్స్, అక్రమ మద్యం లాంటివి ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తుంటాయి. అయితే, మనదేశంలో ఈ తరహా కేసులకు శిక్షలు కఠినంగా ఉండవని చెబుతుంటారు. చట్టాల అమలులోనూ కాస్త లొసుగులు ఉన్నాయని చెబుతుంటారు. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం డ్రగ్స్, గంజాయి అక్రమంగా తరలించడం శిక్షార్హం. కఠిన శిక్షలతో పాటు ఉరి శిక్ష లాంటివి కూడా విధిస్తుంటాయి ఆయా దేశాలు. తాజాగా సింగపూర్‌లో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది.
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. గంజాయి అక్రమ రవాణా చేసిన కేసులో ఇండియా మూలాలున్న వ్యక్తికి సింగపూర్ సర్కార్ ఉరిశిక్ష అమలు చేసింది. మరణ శిక్షను తగ్గించుకొనేందుకు న్యాయ పరంగా జరిగిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించకపోవడంతో సదరు వ్యక్తి ఉరికి వేలాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఈ ఉరి శిక్షపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఉరిశిక్షపై ముందుకే వెళ్లింది.
భారత్ మూలాలున్న తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టు అయ్యాడు. ఓ కిలో గంజాయిని భారత్ నుంచి సింగపూర్‌కు అనుమతి లేకుండా తరలిస్తున్నాడని అతడిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసులో సుప్పయ్యకు 2018 అక్టోబర్ 9న ఉరిశిక్ష ఖరారైంది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకారం అందించినట్లు నిర్ధారణ చేసిన కోర్టు.. సుప్పయ్యకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఇండియా మూలాలున్న వ్యక్తి మరణ శిక్షకు గురి కావడం ఇది రెండోసారి.
అయితే, బాధితుడు తంగరాజు సుప్పయ్య కేసు విచారణలో నిబంధనలు, ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ అమాయకుడైన వ్యక్తిని సింగపూర్ ప్రభుత్వం ఉరితీస్తోందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ శిక్షపై బ్రిటన్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తీవ్రంగా మండిపడ్డారు. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా ఆయనకు బాసటగా నిలిచాయి. అయితే, బ్రాన్సన్ చేసిన ప్రకటనను సింగపూర్ ప్రభుత్వం ఖండించింది. ఆయన వ్యాఖ్యలు సింగపూర్ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ చట్టాల ప్రకారమే అతడికి ఉరి అమలు చేసినట్లు స్పష్టం చేసింది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE