Satvik Suicide Case Latest Update : నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి సాత్విక్‌కు ఆ కాలేజీలో అడ్మిషనే లేదని విచారణ కమిటీ నిర్ధారించింది.
అడ్మిషన్ మరోచోట ఉంటే నార్సింగి క్యాంపస్‌లో క్లాసులకు అటెండ్ అవుతున్నాడని ఎంక్వైరీ కమిటీ సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఈ మేరకు రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ప్రముఖ కార్పొరేట్ కాలేజీలన్నింటిలో ఇలాంటి తతంగమే నడుస్తోందని ఎంక్వైరీ కమిటీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తరగతులు శ్రీచైతన్యలో, సర్టిఫికెట్లు చిన్న చిన్న కాలేజీల పేరుతో జారీ చేస్తున్నారని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని కమిటీ తేల్చి చెప్పింది. నగరంలో అన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఇదే పని చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నార్సింగి శ్రీచైతన్యలో విద్యార్థి ఆత్మహత్య ఘటనను తీసుకొని ప్రవేశాల్లో జరుగుతున్నఅ క్రమాలపై అన్ని కాలేజీల్లోనూ సోదాలు చేయాలని ప్రభుత్వానికి, విద్యాశాఖకు విచారణ కమిటీ సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఇలా ఒక కాలేజీలో అడ్మిషన్లు, మరో కాలేజీలో తరగతుల విధానం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విద్యాశాఖ ఏం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇక విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన ఈ ఉదంతంపై ఇంటర్ బోర్డు ఏం చర్యలు తీసుకుంటుందని నిలదీస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్‌బోర్డు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నార్సింగిలో విద్యార్థి ఆత్మహత్యపై ప్రత్యేకించి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేసినప్పుడే అన్ని విద్యా సంస్థల్లో ఒత్తిడి లేని చదువులు సాధ్యమని, విద్యార్థుల సూసైడ్ కేసులు తగ్గుతాయని చెబుతున్నారు. ఇలా మరికొందరు బలికాక ముందే మేల్కొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
also read :
Kiara Advani Latest Photos at WPL Opening Ceremony 2023, Videos
Tamanna Latest Photos, Stills, instagram pics 2023