సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (kaikala satyanaryana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌కు తరలించనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు రాజకీయ నాయకుడు కైకాల సత్యనారాయణ 25 జూలై 1935 న కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో జన్మించారు. అతను దాదాపు 750 కి పైగా చిత్రాలలో కనిపించారు.
కైకాల సత్యనారాయణ 10 ఏప్రిల్ 1960న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.
సినీ ప్రయాణం :
1959లో చంగయ్య దర్శకత్వం వహించిన సిపాయి కూతురు చిత్రంలో కైకాల నటించారు. అది బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా, N.T.R తో అతనికి దగ్గర పోలికలు ఉన్నాయని దర్శకుడు గమనించాడు. ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించేందుకు ఆయనను ఒప్పించారు. ఆ తర్వాత సత్యనారాయణ పలు సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించాడు. సత్యనారాయణకు ఎన్టీఆర్ ఒక సినిమా లో ఆఫర్ ఇవ్వడం తో 1960లో ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో సత్యనారాయణ యువరాజుగా నటించారు.
బి. విట్టలాచార్య కనక దుర్గ పూజా మహిమలో నెగెటివ్ పాత్రలో నటించారు. అప్పటి నుండి, సత్యనారాయణ విలన్ పాత్రలలో తనని తాను నిరూపించుకోవడం లో సక్సెస్ అయ్యాడు. సత్యనారాయణ రామ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను స్థాపించి కొదమ సింహం (1990), బంగారు కుటుంబం (1994), ముద్దుల మొగుడు (1997) వంటి చిత్రాలను నిర్మించారు. అతను 750కి పైగా చిత్రాలలో కనిపించాడు.
1996లో, మచిలీపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
2012లో, అతను 59వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సౌత్ రీజియన్ II కొరకు జ్యూరీ సభ్యునిగా పనిచేశాడు.
అతను 2011 రఘుపతి వెంకయ్య అవార్డు మరియు 2017 ఫిలింఫేర్ అవార్డ్ ల లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు పొందారు. కైకాల నిర్మించిన చిత్రం బంగారు కుటుంబం (1994) కి ఉత్తమ చలన చిత్రగా నంది అవార్డు ని పొందారు. అలాగే, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డుని, నటశేఖర బిరుదు ని అనంతపురం మరియు గుడివాడ మున్సిపల్ సివిక్ సెంటర్‌లో ప్రభుత్వేతర సంస్థ (NGO) అందించింది.
కళాప్రపూర్ణ బిరుదు ని కావలి కల్చరల్ అసోసియేషన్ అందించింది.
ఇక కైకాల సత్యనారాయణ తెలుగు వారికి యముడుగా సుపరిచితం. చాలా సినిమాల్లో యమధర్మరాజుగా కనిపించి మెప్పించాడు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల నటుడు. విలనీలో కొత్తదనం తీసుకొచ్చాడు. కామెడీ అయినా, ఎమోషన్ అయినా ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరం నుంచి ఇప్పటి తరం హీరోలతో కూడా పనిచేశారు. ఆయన ఎక్కువగా చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ సినిమాల్లో నటించారు.
మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో కూడా నటించాడు. చివరగా మహర్షి సినిమాలో నటించారు. కానీ కైకాల ఇప్పుడు ఇలా కన్నుమూయడంతో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చివరగా చిరంజీవి కైకాల పుట్టినరోజు వేడుకలు జరిపారు. మంచం మీద ఉండగానే చిరంజీవి కైకాల ఇంటికి వెళ్లి కేక్ కట్ చేపించారు. ఆ సందర్బంలో నవ్వుతూ ఉన్న ఫోటోలు కూడా నెట్‌లో ట్రెండ్‌గా మారాయి.