Viral Video: క్యాన్సర్.. ప్రతి ఒక్కరిని ఎంతగా కలవరపెడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది చిన్నారులు మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్య తరగతి దేశాల్లోనే సంభవిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినా చాలామందికి సకాలంలో క్యాన్సర్ చికిత్స అందకపోవడం బాధాకరం. సకాలంలో క్యాన్సర్‌కి చికిత్స అందిస్తే కోలుకోవడం పెద్ద సమస్య ఏమి కాదు.
గొప్ప యోధుడు..
అయితే చిన్న పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుండడం అందరిని కలవర పరుస్తుంది. స్కూల్‌కి వెళ్లి సరదాగా ఆడుకుంటూ ఉండే వయస్సులో కొందరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. నెలల తరబడి వారు క్యాన్సర్ చికిత్సలో భాగంగా దవాఖానలో ఉండడం కన్నీరు పెట్టిస్తుంది. అయితే బెర్నార్డో అనే పిల్లాడు ఆ మధ్య క్యాన్సర్ బారిన పడగా, ఇటీవలే కోలుకున్నాడు. ఇక కోలుకున్న వెంటనే తన తల్లిదండ్రులతో కలిసి స్కూల్‌కి వెళ్లాడు. ఆ సమయంలో అతనికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు తోటి విద్యార్ధులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
బెర్నార్డోకి 2021 ఆగష్టులో ల్యూకేమియా అనే క్యాన్సర్ సోకగా, ఏడాది పాటు కీమోథెరపీ తీసుకున్నాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నవెంటనే స్కూల్‌కి వెళ్లాడు. అతను స్కూల్ గేటు దాటి లోపలికి రాగనే, తోటి విద్యార్థులు దారికి ఇరువైపులా నిల్చొని చప్పట్లు కొడుతూ అతనికి స్వాగతం పలికారు. ఇక టీచర్లు కూడా అతడిని ప్రేమగా కౌగిలించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. నువ్వు నిజంగా ఫైటర్ అంటూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.