samajavaragamana movie review
కథ ఏంటంటే ?
బాలు (శ్రీ విష్ణు) ప్రేమలో విఫలమవుతాడు, ఆ తర్వాత ప్రేమపైనే ద్వేషం పెంచుకుంటాడు. ఈ క్రమంలో తనకు ఏ అమ్మాయి అయినా ఐ లవ్ యూ చెబితే వెంటనే రాకీ కట్టించుకుంటాడు . కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత, బాలు సరయు (రెబా మౌనిక జాన్)ని కలుస్తాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో బాలు మామగారి కొడుకు సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది. దీంతో బాలు, సరయుల ప్రేమకు పెద్ద అడ్డంకి ఏర్పడుతుంది. చివరగా వీరి ప్రేమకథలో ఎలాంటి ట్విస్ట్‌లు జరిగాయి?, మధ్యలో సరయు తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్ర ఏమిటి? చివరకు ఏం జరిగింది? అన్నది మిగతా కథ.
పాజిటివ్ పాయింట్స్ ఏంటి ?
ఈ మూవీ లో మెయిన్ రోల్ లో నటించిన హీరో శ్రీవిష్ణు తన నటనతో మూవీ కి స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచాడు. సినిమాలో సీనియర్ నరేష్ ట్రాక్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫ్యామిలీ ట్రాక్, కామెడీ సన్నివేశాలు.. అలాగే అనుకోని సంఘటనల్లో హీరో, హీరోయిన్లు ఇరుక్కుపోయే సన్నివేశాలు.. ఆ సమస్యల నుంచి హీరో తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఆ సీన్స్ లో శ్రీవిష్ణు అద్బుతంగా నటించాడు.
ముఖ్యంగా సెకండాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్‌లో మంచి కామెడీ పండించారు. మరో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నరేష్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించాడు. డిగ్రీ పాస్ కాలేని సగటు మధ్యతరగతి తండ్రిగా నరేష్ నటన సినిమాకే హైలైట్. హీరోయిన్ గా నటించిన రెబా మౌనిక జాన్ కూడా ఆకట్టుకుంది. తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.
ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. కథకు టర్నింగ్ పాయింట్‌గా ఈ పాత్రలను దర్శకుడు చాలా బాగా రాసుకున్నాడు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రల మేరకు చక్కగా ఒదిగిపోయారు.
నెగెటివ్ పాయింట్స్ ఏంటి ?
దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్లు, ఎన్నో ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ తెచ్చినా కొన్ని సీన్స్ స్లోగా సాగాయి. మొయిన్ సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు నిదానంగా సాగి అనుకున్నంత ఆకట్టుకోలేకపోయాయి. అలాగే సినిమాలోని పాత్రలను ఫస్ట్ హాఫ్‌లో పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అదే విధంగా కామెడీని ఇప్పటికే చాలా సినిమాల్లో చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. సీనియర్ నరేష్ పాత్రను మొదట ఎలివేట్ చేసి అతిథి పాత్రకు తగ్గించారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే ?
ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, దర్శకుడు రామ్ అబ్బరాజు హాస్య సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను రామ్‌రెడ్డి చాలా అందంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అతని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
హిట్టా.. ఫట్టా :
సామజవరగమన మూవీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య సాగే నాటకీయత, నటీనటుల నటన.. ఓవరాల్‌గా దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని బాగా తీశారు. కాకపోతే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నిదానంగా, కొన్ని సన్నివేశాలు రెగ్యులర్‌గా సాగుతాయి. అయితే ఓవరాల్ గా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారనడంలో సందేహం లేదు. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్ : 3.5/5
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE