Telugu Flash News

Rohit Sharma: మ‌తిమ‌రుపు రోహిత్ శ‌ర్మ‌.. పరీక్ష హాల్‌లో స్టూడెంట్ కూడా అంతేనంటూ మీమ్స్

Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న బ్యాట్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ని ఎంతగా వ‌ణికిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రోహిత్ తాజాగా చేసిన ఓ పని నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. నిన్న న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. అతను బౌలింగ్ ఎంచుకుంటాడా? లేక బ్యాటింగ్ తీసుకుంటాడా? అని జవగళ్ శ్రీనాధ్, కామెంటేటర్ రవిశాస్త్రి, కివీస్ సారధి టామ్ లాథమ్ అంతా చూస్తున్నారు. కానీ రోహిత్ మాత్రం తాము ఏం నిర్ణయించుకున్నారో మర్చిపోయి అయోమ‌యానికి గుర‌య్యాడు. సాధారణంగా కాయిన్ టాస్ చేసిన తర్వాత గెలిచిన కెప్టెన్ తన నిర్ణయం వెంట‌నే చెప్పేస్తాడు.

అయితే ముందుగా బౌలింగ్ చేద్దామా? లేక బ్యాటింగ్ తీసుకుందామా? అని టీం మీటింగ్‌లో చర్చించిన రోహిత్ శర్మ.. తాము ఏం నిర్ణయం తీసుకున్నారో మర్చిపోయాడు. దీంతో బుర్ర గోక్కుంటూ.. ‘మేం ముందుగా..’ అంటూ ఆలోచనలో పడిపోయాడు. చివరకు బౌలింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు. ఈ సీన్ చూసిన నెటిజన్లు రోహిత్‌పై తెగ మీమ్స్ పేలుస్తున్నారు. ‘వైవా రూంలో నేను కూడా అంతే.. ఏం గుర్తురాదు’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఇంకొన్ని కామెడీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ‘టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని టీం మేనేజ్‌మెంట్ చెప్పి ఉంటే పరిస్థితి ఏంటి?’ అని కొందరు సరదాగా ప్రశ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

తాజా మ్యాచ్‌లో రోహిత్ తీసుకున్న నిర్ణయం భారత్‌కు కలిసొచ్చింది. బౌలర్లంతా అద్భుతంగా రాణించడంతో న్యూజిల్యాండ్‌ 108 పరుగులకే ఆలౌట్ అయింది. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకోగా.. పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండ్ వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా, శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలిచిన రోహిత్ సేన.. వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అయిన న్యూజిలాండ్‌‌ను మట్టికరిపించింది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. దాంతో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి అడుగు దూరంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో ఇండోర్ వేదికగా మంగళవారం(జనవరి 24) జరగనున్న ఆఖరి వన్డేలో భారత్ క‌నుక‌ విజయం సాధిస్తే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంటుంది.

Exit mobile version