Rewind 2022 : ఈ ఏడాదిలో తెలుగు సినీ పరిశ్రమ కొంత మంది గొప్ప నటులను,వ్యక్తులను కోల్పోయి అటు పరిశ్రమ వారికి ఇటు అభిమానులకి తీరని లోటును మిగిల్చింది.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు అనారోగ్య కారణాల వల్ల ఈ ఏడాది జనవరి 8 న ప్రాణాలు విడిచారు. రమేష్ బాబుపై కొండంత ప్రేమ ఉన్న కృష్ణ గారికి ఆయన మరణం తీర్చలేని లోటుగా మారింది. రమేష్ బాబును హీరోగా నిలబెడదామని కృష్ణ గారు చాలా కాలం ప్రయత్నించినప్పటికి ఆయన సినిమాలలో రాణించలేకపోయారు. కృష్ణ గారి ఆశను ఆ తరువాత మహేష్ బాబు తీరుస్తూ సూపర్ స్టార్ గా ఎదిగారు.
జనవరి 19న టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ 47 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పై అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆయన ఒక సినిమా షూటింగ్ సెట్స్‌లో పడిపోపోవడంతో ఛాతీపై గాయపడ్డారని,ఆ తర్వాత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ అస్వస్థతకు గురవ్వడం వల్ల ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. అక్కడ ఆయన కన్నుమూశారని తెలిపారు.
ఈ ఏడాది మార్చి 12న మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ రావు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందగా, ఇదే రోజున త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతున్న లిరిసిస్ట్ కందికొండ యాదగిరి కూడా చికిత్స పొందుతూ మరణించారు.
1958 లో నటుడిగా తొలిసారి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి,తన కంటూ ప్రేక్షకుల మనసులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సీనియర్ యాక్టర్ బాలయ్య కూడా ఈ ఏడాది ఏప్రిల్ 8న తుదిశ్వాస ను విడిచారు.
ఇలా వరుస మరణాల నుంచి ప్రేక్షకులు,సినీ పరిశ్రమ వాళ్లు కోలుకునే లోపే ఏప్రిల్ 20న ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు గారు ప్రాణాలు విడిచారు.
ఎప్పట్నుంచో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు సెప్టెంబర్ 11న ప్రాణాలను విడిచి ప్రభాస్ కి,ఆయన అభిమానులకి తీరని లోటును మిగిల్చారు.
ఇక ఈ మరణాలు చాలురా భగవంతుడా అని అందరూ దేవుడిని వేడుకుంటున్న తరుణంలో రమేష్ బాబు గారు చనిపోయి ఇంకా ఏడాది కాకుండానే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఆయన తుది శ్వాస విడిచారు. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆయన అనారోగ్య కారణాల వల్ల ఈ ఏడాది నవంబర్ 15న ఆసుపత్రిలో కన్నుమూశారు.
తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలకు చేరువైన కైకాల సత్యనారాయణ గారు కొంత కాలం నుంచి వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధడుతున్నారు.అలా బాధపడుతున్న ఆయన కూడా ఈ ఏడాది డిసెంబర్ 23న తన తుది శ్వాస విడిచారు.