Rewind 2022 : ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ ముందు చతికిల పడిన కొన్ని సినిమాలు మీ కోసం. ఇంతవరకు ఏ పెద్ద హీరో సినిమా విడుదలైనా సరే ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అభిమానులు, ప్రేక్షకులు సినిమాలను ఎగబడి చూసేవారు.
సినిమా టికెట్ల కోసం కౌంటర్ దగ్గర కొట్టుకునే వారు.కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాలో బలమైన కథ, మంచి విషయం లేకపోతే ప్రేక్షకులు కాదు కదా ఆఖరికి అభిమానులు కూడా ఆ సినిమా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీన్ని గట్టిగా నిరూపిస్తూ ఈ ఏడాది చాలా మంది పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీసు ముందు చతికిల పడ్డాయి. అవి ఏ సినిమాలో….ఏ హీరో సినిమాలో… ఒక లుక్ వేద్దాం రండి.
1. సన్ ఆఫ్ ఇండియా (son of india)
మోహన్ బాబు హీరోగా దర్శకుడు రత్న బాబు తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సన్ ఆఫ్ ఇండియా. ఈ చిత్రం 18 February 2022 న విడుదలైంది.ఈ సినిమా కథ గురించి పక్కన పెడితే అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించనంత తక్కువ టిక్కెట్లు అమ్ముడు పోయి సోషల్ మీడియా ట్రోల్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది.
2. రాధే శ్యామ్ (Radhe Shyam)
బాహుబలి సినిమా తరువాత హీరో ప్రభాస్ రేంజ్ ఎక్కడ ఉందో ఆయన ఎంత పెద్ద హీరో నో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా తరువాత ఆయనికి చెప్పుకో తగ్గ విజయాలేమీ రాలేదు. అందులో ఈ ఏడాది విడుదలైన రాధే శ్యామ్ ఒకటి. ఈ మూవీ 11 March 2022 న భారీ అంచనాలతో విడుదల అయ్యింది. దాదాపుగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నివేశాలన్నీ బాగున్నప్పటికీ, బలమైన కథ, కథనం లేకపోవడం వల్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
3. ఆచార్య (Acharya)
మెగా స్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య 29 April 2022 రోజున విడుదలైన సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కనిపించినప్పటికీ,మెగా స్టార్ స్థాయికి తగ్గ కథ, ప్రేక్షకులను అలరించే కథనం లేకపోవడం వల్ల బాక్స్ఆఫీస్ దగ్గర విఫలమైంది.
4. లైగర్ (Liger)
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలలో ఒకడిగా ఎదిగిన విజయ దేవరకొండ ఆ తరువాత నుంచి ప్రేక్షకులను అలరించే సినిమాలను అందించడంలో విఫలమౌతున్నాడు. ఇక తను చివరిగా ఆశలన్నీ పెట్టుకున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కూడా విజయ్ నమ్మకాలని వమ్ము చేస్తూ 25 August 2022 రోజున విడుదలై బాక్స్ ఆఫీస్ ముందు చతికిల పడింది. మొదట్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మెప్పించలేని కథ, కథనం, క్లైమాక్స్ తో అందర్నీ నిరాశ పరిచింది.
5. జిన్నా (Ginna)
చాలా కాలం నుంచి సరైన విజయాలు లేక సతమతమవుతున్న హీరో మంచు విష్ణు “జిన్నా” సినిమా 21 October 2022 న విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమైంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పాత చింతకాయ పచ్చడి లాంటి కథతో వచ్చి ఎవరికీ నచ్చకుండానే వెళ్లిపోయింది. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకర్షించడానికి సన్నీ లియోనీ, పాయల్ రాజాపుత్ లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ వారి పాత్ర సినిమాకు ప్లస్ కాలేకపోయింది.
also read news:
Ginger For Skin : అల్లం ముక్కతో అద్భుతమైన చర్మ సౌందర్యం.. ఆ సమస్యలు తొలగిపోతాయి!
Taj Mahal : తాజ్ మహల్ చరిత్ర, మీరు తెలుసుకోవలసిన అత్యద్భుత నిర్మాణ విశేషాలు