Telugu Flash News

Etala Vs Revanth : కాంగ్రెస్‌కు రూ.25 కోట్ల డబ్బు అందిందన్న ఈటల.. ప్రమాణానికి సిద్ధమన్న రేవంత్‌

etala rajender and revanth reddy

Etala Vs Revanth : ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో రాజకీయ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు రోజుకో అంశాన్ని తెరమీదకు తెచ్చి రాజకీయం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్(BRS party), కాంగ్రెస్‌ (Congress), బీజేపీ(BJP) మధ్య ఓ సరికొత్త వార్‌ నడుస్తోంది.

బీజేపీ నేత ఈటల రాజేందర్‌ (Etela rajender) .. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి (Revanth reddy) పై కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కతాను ముక్కలేనని, ఎన్నికల సమయానికి ఎన్ని ఆరోపణలు చేసుకున్నా ఇరు పార్టీలూ దగ్గరవుతాయని ఈటల కామెంట్‌ చేశారు. దాంతో పాటు కేసీఆర్.. కాంగ్రెస్‌కు ఆర్థిక సాయం కూడా చేశారని సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

దీనిపై అటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా దీటుగా రిప్లై వచ్చింది. రేవంత్‌ రెడ్డి స్వయంగా స్పందించారు. తనకు గానీ, కాంగ్రెస్‌ పార్టీకి గానీ కేసీఆర్‌ నగదు ఇచ్చి ఉంటే నిరూపించాలని డిమాండ్‌ చేశారు. అసలేం జరిగిందంటే… తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్ఎస్‌ నుంచి డబ్బులు పంపిందని, దీనిపై గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని ఈటల పేర్కొన్నారు. మునుగోడులో ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్ఎస్‌ నుంచి రూ.25 కోట్లు వెళ్లాయనేది జగమెరిగిన సత్యమని చెప్పారు.

రెండు పార్టీలూ ఎంత బుకాయించినా ఏదో ఒకచోట కలిసే ఉంటారని, కాంగ్రెస్‌ పార్టీకి ఏమైనా జరిగితే మొదట స్పందించేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటూ ఈటల కామెంట్లు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఒంటరి చేయాలని చాలా పార్టీలు ఏకమవుతున్నాయని, అసలు కేసీఆర్‌కు అంత డబ్బు ఎక్కడిదని ఈటల ప్రశ్నించారు. ఇదంతా తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్మేకదా అని ప్రశ్నించారు. మరోవైపు ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమన్నారు. కేసీఆర్‌.. కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఇచ్చారనేది పచ్చి అబద్ధమని, ఈటల రాజేందర్‌ ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్‌ విమర్శించారు.

ఈటల ఆరోపణలను రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నుంచి గానీ, కేసీఆర్ నుంచి గానీ తాను ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని రేవంత్‌ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయానికి రావాలని, అమ్మవారి వద్ద శనివారం సాయంత్రం ఆరు గంటలకు తడి దుస్తులతో వెళ్లి అమ్మవారిపై ప్రమాణం చేయడానికి సిద్ధమని రేవంత్‌ సవాల్‌ విసిరారు. తనపై ఆరోపణలు చేసిన ఈటల కూడా సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. అయితే, శనివారం సాయంత్రం రేవంత్‌ సిద్ధమైనా ఈటల రాలేదు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

also read :

Shah Rukh Khan : బాబోయ్.. ఒక్క సినిమాకి రూ.200 కోట్ల రెమ్యున‌రేష‌నా.. ఉలిక్కిప‌డుతున్న సినీ ప్రియులు

 

 

Exit mobile version