తమిళ, కన్నడ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న రెజీనా కసాండ్రా (Regina Cassandra) , తెలుగు తెరకు ‘శివ మనసులో శ్రుతి’తో అడుగుపెట్టి మెరిసింది. ‘రోటీన్ లవ్ స్టోరీ’, ‘రా రా కృష్ణయ్య’, ‘పవర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లఘా’ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
అమితాబ్ బచ్చన్‌తో కలిసి తెరపై కనిపించే అవకాశం దక్కించుకున్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా ఆగిపోవడం రెజీనా కసాండ్రాకు నిరాశ కలిగించింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆమె, బాలీవుడ్‌పై తన అనుభవాలను పంచుకుంటూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“సౌత్‌లో సినిమాలు చేసేటప్పుడు మేమే డబ్బింగ్ చెప్పుకుంటాము. కానీ బాలీవుడ్లో లిప్ సింక్ చేయడం అంత సులభం కాదు. హిందీ భాష మనకు అంత సుపరిచితం కాకపోవడంతో లిప్ సింక్‌కు, డబ్బింగ్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది. సౌత్‌లో మన భాష అయితే అంత సులభంగా డబ్బింగ్ చెప్పొచ్చు కదా!
సౌత్ ఇండస్ట్రీ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ భాష చాలా ముఖ్యం. అక్కడ భాష రాకపోతే అవకాశాలు రావడం కష్టం. ముంబైలో ఉంటూ, నెట్వర్కింగ్ చేస్తూ, పార్టీలకు వెళ్తూ అవకాశాల కోసం ప్రయత్నించాలి.
బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. అక్కడ కేవలం నటన మాత్రమే కాకుండా, ఇతర అంశాలు కూడా చాలా ముఖ్యం. నేను నాకు నచ్చిన విధంగా నటించాలనుకుంటాను కానీ, బాలీవుడ్లో అలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.” అని రెజీనా కసాండ్రా చెప్పింది.