టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ చెత్త ప్రదర్శనకు మాజీలతో పాటు పలువురు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కోచ్ ద్రావిడ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్రావిడ్ వచ్చాక టీమిండియా మంచి జట్టుగా మారి అద్భుత విజయాలు సాధిస్తుందని అనుకుంటే ఇంకా పరమ చెత్తగా మారిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ద్రావిడ్ న్యూజిలాండ్ సిరీస్‌కి బ్రేక్ తీసుకోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పలు సిరీస్ లకు విరామం తీసుకున్న ద్రావిడ్.. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా రెస్ట్ తీసుకున్నాడు.ఆయన స్థానంలో లక్ష్మణ్ నే హెడ్ కోచ్ గా నియమించింది బీసీసీఐ. సాధారణంగా ఆటగాళ్లకు విరామమివ్వడం తెలుసు కాని హెడ్ కోచ్ లకూ విరామమివ్వడం కొత్తగా ఉందంటూ మండిపడుతున్నారు.
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ కు వెళ్లగా ద్రావిడ్ ఆ టూర్ కు మిస్ అయ్యాడు. జింబాబ్వే టూర్ కూడా వెళ్లలేదు. అప్పుడు ఈ రెండు టూర్లకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇక తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ద్రావిడ్ విరామం తీసుకోవడంతో తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ… అసలు కోచ్ లు విరామం తీసుకోవాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించాడు.
ఐపీఎల్ ఆడేప్పుడు మూడు నెలల పాటు ఎలాగూ టీమిండియా హెడ్ కోచ్ విశ్రాంతిలోనే ఉంటాడు కదా, ప్రతీ రెండు సిరీస్ లకు విరామమివ్వడం దేనికి..? అంటూ తనదైన శైలిలో మండిపడ్డాడు
నేనైతే ఇలా బ్రేక్ లు తీసుకోలేదు. నేను ఎల్లప్పుడూ నా జట్టును అర్థం చేసుకునేందుకు ట్రై చేసాను. ఈ విషయంలో నేను ఎవరినీ వేలెత్తి చూపాలని కాదు, కానీ జట్టు గురించి ఆలోచించండి. వచ్చే రెండేళ్లలో ప్రపంచకప్ ఉంది. ఆ జట్టును సన్నద్ధం చేయడానికి నిత్యం ఆటగాళ్లతో ఉండాలి.
జట్టులో ఎవరి సామర్థ్యమెంత..? ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి..? మ్యాచ్ విన్నర్లు ఎవరు..? వంటివి గుర్తించి, వారిని ప్రోత్సహించే విధంగా తయారు చేయాలి. న్యూజిలాండ్ సిరీస్ తోనే అది మొదలుపెడితే బాగుండేది. ఈ టూర్ లో చాలా మంది కొత్త కుర్రాళ్లు ఉన్నారు. వారిని మెరుగైన ఆటగాళ్లుగా తయారుచేసే విధంగా కోచింగ్ సిబ్బంది పనిచేయాలి..’అని రవిశాస్త్రి తెలిపాడు.
also read news: