Raghava Lawrence: కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ఇలా మల్టీ టాలెంటెడ్‌గా ఎందరో ప్రేక్షకుల మన్ననలు పొందాడు లారెన్స్. ఆయన కేవలం సినీ సెలబ్రిటీగానే కాదు సామాజిక స్పృహ ఉన్నవ్యక్తిగాను అందరి ప్రేమ గెలుచుకున్నాడు.
ఎన్నో సందర్భాలలో ఎందరో అనాథలను అక్కున చేర్చుకున్న లారెన్స్ ఇప్పుడు తాను కొత్త మార్పుకి శ్రీకారం చుడతానని అంటున్నారు. ఇక నుండి తాను ఎవరికి సాయం చేసిన వారు నా కాళ్లపై పడకూడదు.
నేనే వారి పాదాలపై పడి సేవ చేస్తానని పేర్కొన్నాడు. ఈ చిన్న మార్పు నాలో రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు లారెన్స్.
మార్పు నా నుండే..
ఈ రోజే తొలి అడుగు వేస్తాను. ఇప్పటి వరకు ధనవంతుల కాళ్లపై పేదలు పడి సాయం కోరారు. ఇక నుండి అలాంటి సంఘటనలు చూడాలని నేను భావించడం లేదు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను చాలా బాధించాయి. వాటిని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఓ బిడ్డ తల్లిదండ్రులు గుండె ఆపరేషన్ కోసం నా దగ్గరకు వచ్చి నా పాదాలపై పడ్డారు. వెంటనే నేను దూరం వెళ్లా. అయితే ఆ బిడ్డ తన తల్లిదండ్రులు నా పాదాలపై పడడం చూసి ఏడ్చేశాడు. పిల్లలు తమ తల్లిదండ్రులని హీరోగా చూస్తూ ఉంటారు. కాని అలా కాళ్లపై పడే సరికి తట్టుకోలేకపోయాడు.
అది నన్ను చాలా బాధించింది. అందుకే నేటి నుండి నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మనం డబ్బు ఇచ్చి దేవుళ్లం కాలేము. ఇక నుంచి నేను సహాయం చేసేవారి పాదాల చెంతకువెళ్లి వారి పాదాలకు నమస్కరించి దీవేనలు కోరతాను. మార్పు నా నుంచే ప్రారంభం కావాలి. ఇందుకు మీ అందరి మీ దీవెనలు కావాలి , దీనికి సంబంధించిన వీడియోను త్వరలో విడుదల చేస్తాను.. అంటూ లారెన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఓ బాలుడిపై కాళ్లకు నమస్కరించిన ఫొటోను పోస్ట్ చేశాడు. లారెన్స్ మంచి మనస్సుపై ప్రశంసల వర్షం కురుస్తుంది.