Imran Khan: పాకిస్తాన్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు వ్యవహారంతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అల్ ఖాదీర్ ట్రస్ట్ కేసులో తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట కలిగింది. తెహ్రీక్- ఎ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడయిన ఇమ్రాన్ ఖాన్‌కు ఈ మేరకు రెండు వారాల పాటు ఉపశమనం లభించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాక్‌లో ఓవైపు ఆర్థిక సంక్షోభంతో పాటు మరోవైపు ద్రవ్యోల్బణ సమస్య కూడా ఆకాశాన్నంటుతున్నాయి.
ఇక ఇమ్రాన్ ఖాన్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల పాటు ఈ బెయిల్ వ్యాలిడిటీ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, అంతకుముందు.. ఇమ్రాన్‌కు సంఘీభావంగా భారీ సంఖ్యలో అభిమానులు కోర్టు వద్ద గుమిగూడారు. భారీ బందోబస్తు మధ్య ఇమ్రాన్‌ను కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు సభ్యులు కలిగిన ధర్మాసనం ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో విచారణ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సుమారు రెండు గంటల పాటు విచారణ ప్రక్రియ వాయిదా పడింది. అయినప్పటికీ చివరకు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక ఇదే కేసు విషయమై ఈ కోర్టు పరిసర ప్రాంతాల్లోనే మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ రేంజర్లు అత్యంత కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌ను తోసేసుకుంటూ వెళ్లారు. అనంతరం అరెస్టు చేశారు.
ఇమ్రాన్ అరెస్టు నేపథ్యంలో ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరుకొని నిరసన తెలపడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడం తగదని, ఆయన అరెస్టు అక్రమమని తేల్చి చెప్పింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతోపాటు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించి.. ఆ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలంటూ మాజీ ప్రధానికి సుప్రీం సూచించింది. అనంతరం ఇవాళ ఆయనకు బెయిల్ దొరికింది. అంతకుముందే హింసకు ప్రేరేపించారన్న ఓ కేసులోనూ ఇమ్రాన్ ఖాన్‌కు ఇక్కడి ఉగ్రవాద నిరోధక కోర్టు మే 23 వరకు బెయిల్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటి వరకు 201 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
Read Also : custody telugu movie review : ‘కస్టడీ’ తెలుగు మూవీ రివ్యూ .. ప్రయోగం ఫలించిందా..!