Telugu Flash News

Pope Benedict XVI : క్షీణిస్తున్న మాజీ పోప్‌ బెనెడిక్ట్‌ ఆరోగ్యం.. అతని కోసం ప్రార్థించాలన్న ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌

pope emeritus benedict xvi health

మాజీ పోప్‌ బెనెడిక్ట్‌ (Pope Benedict XVI) ఆరోగ్యం క్షీణించింది. 95 ఏళ్ల బెనెడిక్ట్‌.. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారిందని ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌ వెల్లడించారు. ఆయన కోసం అందరూ ప్రార్థించాలని ఈ సందర్భంగా పోప్‌ ప్రజలను కోరారు. క్యాథలిక్‌ మతాధిపతిగా వ్యవహరించిన పోప్‌ బెనెడిక్ట్‌.. వృద్ధాప్య సమస్యల కారణంగా 2013లో తప్పుకున్నారు. హృద్రోగ, వయోభారం సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆయన కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు.

పోప్‌ ఆరోగ్యంపై వాటికన్‌ సిటీ చర్చి వర్గాలు ఈ మేరకు ప్రకటన వెలువరించాయి. ఆయన ఆరోగ్యం గురించి ప్రజలు ప్రార్థనలు చేయాలని చర్చి వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించాయి. చర్చి అత్యున్నత పదవి నుంచి వైదొలిగి తొమ్మిదేళ్లవుతున్న క్రమంలో ఆయన చాలా వరకు ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనారోగ్యం, వయోభారం సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారు.

పోప్‌ బెనెడిక్ట్‌ ఆరోగ్యం గురించి ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందిస్తూ.. పోప్‌ బెనెడిక్ట్‌ ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థించాలని మనవి చేశారు. అతని ఆరోగ్యం క్షీణిస్తోందని బాధాతప్త హృదయంతో చెప్పాల్సి వస్తోందని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఓ ప్రకటన ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వాటికన్‌ సిటీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

వివాదాల పుట్ట.. పోప్‌ బెనెడిక్ట్‌

పోప్‌ బెనెడిక్ట్‌ పదవీ కాలం అనేక వివాదాల్లో చిక్కుకొని ముగిసింది. 2013లో ఆయన పోప్‌ పదవి నుంచి తప్పుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వయోభారం, ఆరోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలిగినట్లు అప్పట్లో బెనెడిక్ట్‌ ప్రకటించారు. పోప్‌ పదవి చరిత్రలో ఇలా అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలి సారి. ఆయనకంటే ముందు 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా గ్రెగొరీ XII రాజీనామా చేశారు. మరోవైపు బెనెడిక్ట్‌ 1977 నుంచి 1982 మధ్య కాలంలో మ్యూనిచ్‌ ఆర్చ్‌ బిషప్‌గా వ్యవహరించారు. ఈ సమయంలోనే చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదు కావడం సంచలనం రేకెత్తించింది. అనంతరం వాటికన్‌ క్రిమినల్‌ చట్టంలో మార్పులు తెచ్చి కఠినతరం చేశారు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version