Modi with Zelensky: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీని కలిశారు. జపాన్ దేశంలో జరుగుతున్న జీ7 సదస్సు క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టిన నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులు నేరుగా కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వివాదాన్ని మానవత్వానికి సంబంధించిన సమస్యగా భారత ప్రధాని అభివర్ణించారు.
దీనికి పరిష్కారం కనుక్కోవడానికి ఇండియా చేయగలిగినంత కృషి చేస్తుందంటూ జెలెన్స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రంచానికే పెను సమస్యగా మారిందని, దాదాపు అన్ని దేశాలనూ ప్రభావితం చేసిందని ఈ సందర్భంగా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ యుద్ధాన్ని తాను రాజకీయ, ఆర్థిక సమస్యగా చూడటం లేదన్న నరేంద్ర మోదీ.. ఈ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్యగా చూస్తామన్నారు.
యుద్ధం జరిగితే దాని పరిణామాలు, బాధలు అందరికంటే మీకే బాగా తెలుసని జెలెన్స్కీతో మోదీ అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధం సందర్భంగా ఇండియాకు తిరిగి వచ్చిన భారత విద్యార్థులు అక్కడి పరిస్థితులు వివరించారని మోదీ గుర్తు చేసుకున్నారు. మీ పౌరుల బాధ, ఆవేదనను తాము అర్థం చేసుకోగలమన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సమస్యను ఇండియాతో పాటు వ్యక్తిగతంగా వీలైనంత వరకు కృషి చేస్తామని మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇక ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై మోదీ, జెలెన్స్కీలు ఇదివరకే చాలా సార్లు ఫోన్ ద్వారా మాట్లాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. వర్చువల్గా కూడా చాలా సార్లు వీడియో కాన్ఫరెన్స్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడారు. చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా రెండు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. శాంతి నెలకొనేలా చేసే ప్రయత్నాలకు తాము మద్దతుగా ఉంటామని భారత్ స్పష్టం చేసింది. ఇక జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ.. యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్, జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయేల్ మెక్రాన్ తదితర ముఖ్య నేతతో భేటీ అయ్యారు.
Read Also : RBI On Rs.2000 Notes: రెండువేల రూపాయల నోటుపై సంచలన నిర్ణయం.. ఉపసంహరించుకున్న ఆర్బీఐ