Telugu Flash News

Pawan Kalyan: తెలంగాణలో పర్యటనలుంటాయా? వారాహి వాహన పూజల నేపథ్యంలో కొత్త చర్చ!

pawan kalyan varahi vehicle

pawan kalyan varahi vehicle

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో తన వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్న నేపథ్యంలో తెలంగాణలో కొత్త చర్చ ఊపందుకుంది. పూజల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించేందుకు పవన్‌ సిద్ధమవుతున్నారని జనసేన వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఈ ఏడాది, మరో ఏడాది కాలంలోనే ఏపీలోనూ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల్లో కలియతిరగాలని జనసేనాని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కరీంనగర్‌ జిల్లా కొండగట్టు ఆలయంలో వారాహికి పూజల అనంతరం తెలంగాణ రాష్ట్ర నేతలతో పవన్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోటీ చేయాల్సిన స్థానాలు, బలం కలిగిన నియోజకవర్గాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎప్పటి నుంచి పర్యటనలు ఉంటాయనేది స్పష్టత రావాల్సి ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. వారాహి వాహనంపై తమ అభిమాన నటుడు, నాయకుడు యాత్ర చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఓవైపు సినిమాలు, మరోవైపు ఏపీ పాలిటిక్స్‌తో బిజీగా ఉంటున్న పవన్‌ కల్యాణ్‌కు.. తాజాగా వారాహి వాహనానికి పూజలు చేయించుకొనేందుకు తీరిక దొరికింది. పూజలు చేసేందుకే ఇన్ని రోజులు సమయం పడితే.. ఇక పర్యటనలకు ఇంకెన్ని రోజులు పడుతుందోనంటూ జనసైనికులు ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఏం జరగనుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

బలోపేతం దిశగా ఆలోచన చేస్తారా?

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే, కేసీఆర్‌ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌సహా అన్ని పార్టీలూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో అసలు నిర్మాణమే సరిగా లేని జనసేన కాస్త స్పీడు పెంచాల్సిన అవసరం ఉందని నేతలు ఆశిస్తున్నారు. పార్టీ మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే కనిపిస్తున్నారని, ముఖ్య నేతలను పార్టీలోకి చేర్చుకొని బలోపేతం చేయాలని కోరుతున్నారు.

also read :

Viral video today : ప్రేమికుల రొమాన్స్‌.. మరీ పబ్లిక్‌గానా? కదులుతున్న కారులో ఏం చేశారో మీరే చూడండి!

Heroines: హీరోల‌లో చాలా మార్పులు.. హీరోయిన్స్ లేకుండానే లాగించేస్తున్నారుగా…!

Exit mobile version