Telugu Flash News

TDP – Janasena : ఏపీలో ఆ రెండు పార్టీల పొత్తు ఖాయమా? పవన్‌ కల్యాణ్‌ ప్లాన్‌ ఏంటి?

TDP – Janasena : ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే వ్యూహాలకు అధికార, ప్రతిపక్షాలు పదును పెట్టాయి. ఓవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి వై నాట్‌ 175.. అనే స్లోగన్‌ ఎత్తుకున్నారు. పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే అప్రమత్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో పర్యటించేలా ఆదేశాలు ఇచ్చారు.

ఇక ప్రతిపక్షం కూడా ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఓడిపోతే ఇక భవిష్యత్‌లో గెలవలేమని టీడీపీ భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ.. ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఏకంగా 23 సీట్లకు పరిమితం అయ్యింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించిన పార్టీకి చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో దుస్థితి దాపురించడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు చంద్రబాబునాయుడు.

2019 ఎన్నికల్లో లాగా ఒంటరిగా కాకుండా ఈసారి పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

అటు పవన్‌ కల్యాణ్‌ సైతం ఇటీవల ప్రభుత్వంపై పోరు ఉధృతం చేశారు. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించి తీరుతామంటున్న పవన్‌.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనీయబోమని స్పష్టం చేశారు.

ముగ్గురూ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును తాజాగా పవన్‌ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పవన్‌.. చంద్రబాబుతో సుమారు రెండు గంటలపాటు భేటీ అయి పలు అంశాలపై మాట్లాడారు.

రాబోయే ఎన్నికలు పొత్తులు ఖరారైనట్లు అప్పుడే వార్తలు వస్తున్నాయి. అటు బీజేపీ మాత్రం ఎలా ముందుకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది.

చంద్రబాబు చాణక్యంతో ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్‌ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అటు పవన్‌ కల్యాణ్‌ సైతం ఇదే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.

also read:

SKY: కిందపడుతూ, మీద ప‌డుతూ ఆ షాట్స్ సూర్య ఎలా ఆడ‌గ‌లుగుతున్నాడు…సీక్రెట్ చెప్పిన స్కై

Pakistan Crisis : పాకిస్థాన్ ఆర్ధిక తిప్పలను అధిగమిస్తుందా? లేక శ్రీలంకలా దివాళా దిశగా పయనిస్తుందా?

Exit mobile version