పాకిస్తాన్ లో సంక్షోభానికి విద్యుత్ కోతలు (pakistan power cut) తోడయ్యాయి. ఇప్పటికే ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తాజాగా సోమవారం నేషనల్ గ్రిడ్‌లో భారీ వైఫల్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ ప్రజలు కరెంటు కోతలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అక్కడి ఎనర్జీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వోల్టేజ్‌లో హెచ్చుతగ్గుల కారణంగా పవర్ గ్రిడ్‌లో వైఫల్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాక్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌లో ఎక్కువ ప్రభావం కనిపించింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో, దాదుల మధ్య కరెంటు సరఫరా ఫ్రీక్వెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. వోల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగానే సమస్య ఏర్పడినట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళకు కూడా కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కరెంటుతో నడిచే పరిశ్రమలు చాలా వరకు మూతపడ్డాయి. వ్యవస్థలు స్తంభించాయి. అనేక ఆస్పత్రులు, స్కూళ్లు, ఆఫీసుల్లో పనులు నిలిచిపోయాయి.
వెంటనే పునరుద్ధరిస్తున్నాం..
అయితే, ఇది తీవ్ర సంక్షోభమేమీ కాదని పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ పేర్కొన్నారు. శీతాకాలంలో సాధారణంగా విద్యుత్‌కు డిమాండ్ కాస్త తగ్గుతుందన్నారు. దీంతో రాత్రి వేళల్లో తాత్కాలికంగా విద్యుదుత్పత్తిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం రాత్రి కూడా ఇలాగే చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ త్వరితగతిన విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు.
also read :
Layoffs: వెంటాడుతున్న లేఆఫ్ కత్తి.. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఊడిన భారతీయుల ఉద్యోగాలు!
Pawan Kalyan: తెలంగాణలో పర్యటనలుంటాయా? వారాహి వాహన పూజల నేపథ్యంలో కొత్త చర్చ!