Telugu Flash News

Pakistan economic crisis : పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం.. గోధుమ పిండి కోసం జనం తిప్పలు !

pakistan flour crisis

Pakistan economic crisis : పాకిస్తాన్ ఆర్ధిక స్థితి రోజు రోజుకీ దిగజారుతుండడంతో దీని ప్రభావం నిత్యవసరాలపై మరింత ఎక్కువైంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం, వరదలు అక్కడ పరిస్థితిని మరింత కష్టతరం చేస్తున్నాయి.

వరదల కారణంగా గోధుమ పంట నాశనం కావడంతో, గోధుమపిండి ధరలు ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. గోధుమ పిండి కోసం ప్రజలు పడుతున్న పాట్లను విడియోల తీసి పోస్ట్ చేస్తుండడంతో అవి వైరల్ గా మారుతున్నాయి.

గోధుమల సంక్షోభంతో పాకిస్థాన్ ప్రజలు ఆహార కొరతతో కడుపు నింపుకోడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రస్తుతం 10 కిలోల గోధుమ బస్తా విలువ రూ.1,500 ఉండగా,20 కిలోల గోధుమ బస్తా విలువ రూ.2,800 ఉంది.

మరో పక్క పాక్ ప్రభుత్వం అనేక ప్రావిన్స్లలో, సబ్సిడీపై పిండిని సరఫరా చేస్తోంది. కానీ దీన్ని కొనుగోలు చేయడానికి కూడా వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నుంచుంటున్నారు.

ఇలా గంటల కొద్దీ ప్రజలు లైన్లో నుంచుని ఉండడంతో ఇది గొడవలకు,తొక్కిసలాటలకు దారితీసింది. ఇదే విధంగా సింధ్, ఖైబర్ పుంఖ్వా, బలూచిస్థాన్లలో తొక్కిసలాట కూడా జరిగింది. సింధ్ ప్రావిన్స్ ని మీర్పూర్ ఖాస్ నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తొక్కిసలాట జరగకుండా నియంత్రించడానికి పాక్ ప్రభుత్వం సైన్యాన్ని మోహరింపచేసింది.

తీవ్ర ఆర్దిక సంక్షోభం

ఇదిలా ఉండగా మరోపక్క తమ ప్రావిన్స్లలో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని,తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనీ అత్యవసర ప్రాతిపదికన 4,00,000 బస్తాల గోధుమలు తమకు వెంటనే అవసరమని బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్ చాయ్ తెలిపారు.

బలూచిస్థాన్ సంక్షోభానికి ఫెడరల్, సింధ్ పంజాబ్ ప్రభుత్వాలను మంత్రి జమరాక్ అచక్ చాయ్ నిందించారు. పంజాబ్ ముఖ్య మంత్రి పర్వేజ్ ఇలాహి తమకు 6,00,000 బస్తాల గోధుమలను ఇస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదని ఆయన విమర్సించారు.

ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రాను రాను ఇది మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని జమరాక్ అచక్ చాయ్ హెచ్చరించారు. ఈ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోడానికి పాక్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది.

దేశంలో గోధుమల కొరతను తీర్చేందుకు మొత్తం 75 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు పెద్ద ఎత్తున కరాచీ పోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది.అదే విధంగా రష్యా నుంచి అదనంగా 4 లక్షల 50 వేల టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టు ద్వారా పాకిస్థాన్ కి చేరుకుంది.

అయితే పాకిస్థాన్ కి సంబంధించి దాదాపు 70శాతం గోధుమ ఉత్పత్తి పంజాబ్ నుంచి వస్తుండగా.. గోధుమల దిగుమతికి సంబంధించి ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేదని,ఇదే గోధుమ పిండి కొరతకు దారి తీసిందని భావిస్తున్నారు.ఈ సంక్షోభానికి ప్రభుత్వం,పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని, ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ ఘోరంగా విఫలమైందని విమర్శలు చెలరేగుతున్నాయి.

కాగా ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ప్రజల అవసరాలను తీర్చలేక పాకిస్థాన్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

also read: 

RRR Movie – Naatu Naatu – Golden Globes 2023 : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స‌త్తా చాటిన ఆర్ఆర్ఆర్

thegimpu telugu movie review : ‘తెగింపు’ తెలుగు మూవీ రివ్యూ

 

Exit mobile version