Telugu Flash News

Pakistan Crisis : పాక్‌కు అప్పుల కష్టాలు.. విద్యుత్‌ ఆదా కోసం వినూత్న నిర్ణయాలు!

pakistan crisis

Pakistan Crisis : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం ప్రభావం మన పొరుగుదేశం పాకిస్తాన్‌పై కూడా తీవ్రంగా చూపుతోంది. ఆ దేశం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ తన ఖర్చులను తగ్గించుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో దానిలోంచి బయట పడటానికి పొదుపు చర్యలను పాటించేందుకు ప్రయత్నిస్తోందట.

ఇందులో భాగంగానే ఇంధన పొదుపు ప్రణాళిక గురించి కేనెబినెట్‌ భేటీలో జోరుగా చర్చలు జరిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మీడియాకు వెల్లడించారు. ప్రజలందరూ ఈ నియమాలను నిక్కచ్చిగా పాటించాలని సూచించారాయన. మార్కెట్లను రాత్రి 8.30కే బంద్‌ చేయాలని సూచించారు. కల్యాణమండపాలను రాత్రి 10 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని చెప్పారు.

ఇలా చేయడం వల్ల ఖజానాకు సుమారు ఆరు వేల కోట్ల వరకు ఆదా అవుతుందని మంత్రి చెప్పారు. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఫిలమెంట్‌ బల్బుల తయారీని ఆపేస్తున్నామన్న మంత్రి.. దీని ద్వారా సుమారు 2,200 కోట్లు ఆదా చేస్తామన్నారు. గ్యాస్‌ను తక్కువగా వినియోగించే గీజర్ల వాడకాన్ని అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా సుమారు 9,200 కోట్ల ఆదా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు పక్కపక్కనే ఉండే వీధిలైట్లు ఆపేయడం ద్వారా కూడా డబ్బు ఆదా చేయగలుగుతామన్నారు.

వంట గ్యాస్‌ ప్లాస్టిక్‌ సంచుల్లో..





పాకిస్తాన్‌లో ధరల పెరుగుదలతో ప్రజలు వంట గ్యాస్‌ను ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు నిబంధనలు కఠినతరం చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. వర్క్‌ ఫ్రం హోమ్‌ను అమలు చేస్తామని మంత్రి ఆసిఫ్‌ ప్రకటించారు. సన్‌లైట్‌ అందుబాటులో ఉన్నప్పుడే సమావేశాలు జరుపుకోవాలని సూచించారు. ఇంధన దిగుమతులు తగ్గించుకోవడానికి త్వరలోనే విద్యుత్‌ బైకులను తీసుకొస్తామని వెల్లడించారు. అయితే, ఇవన్నీ సక్రమంగా జరిగితేనే మాంద్యం నుంచి పాకిస్తాన్‌ బయటపడుతుందని, లేకపోతే ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

also read : 

సీఐతో మహిళా ఎస్‌ఐ ప్రేమాయణం.. కమిషనర్‌ వద్ద పంచాయితీ.. ఏం తేల్చారంటే..!

Rashmika: స‌మంత ఆరోగ్యం గురించి స్పందించిన ర‌ష్మిక‌.. ఎమోష‌న‌ల్ అవుతూ స్ట‌న్నింగ్ కామెంట్

 

Exit mobile version