Telugu Flash News

WTC Final: మంచి ఛాన్స్ కోల్పోయిన పాక్.. ఈ నాలుగు జ‌ట్ల మ‌ధ్యే ఫైన‌ల్ ఛాన్స్..!

WTC Final: సొంత గడ్డ మీద ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న పాకిస్తాన్ దానిని కోల్పోయింది. ఇంగ్లండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓడటంతో.. ఆ జట్టు అవకాశాలు మూసుకుపోయాయి. కరాచీలో చివరి టెస్టు ఆడాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది అనే చెప్పాలి. ఇప్పటికే ఇంగ్లాండ్ కూడా ఈ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌.. ఆ తర్వాత సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా భారత్ తన అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌ల‌సి ఉంది.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా ముందున్న విష‌యం తెలిసిందే.

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో గెలుపొందిన ఆసీస్.. డిసెంబర్ 17 నుంచి సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుండ‌గా, ఆ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత గడ్డ మీద 4 టెస్టుల బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాన్ని పాక్ చేజార్చుకోవడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మాత్రమే ఇప్పుడు రేసులో మిగిలాయి. ఆస్ట్రేలియా ఇంకా ఏడు టెస్టులు ఆడాల్సి ఉండగా.. అందులో 3 మ్యాచ్‌లు గెలిస్తే చాలు ఫైనల్ చేరుకుంటుంది. రెండు టెస్టులు గెలిచి.. ఒకటి డ్రాగా ముగించినప్పటికీ.. ఆ జట్టు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. ఇక సౌతాఫ్రికా ఇంకా 5 టెస్టులు ఆడాల్సి ఉండగా.. మూడు విజయాలు సాధిస్తే ఫైనల్ చేరే ఛాన్స్ త‌ప్ప‌క‌ ఉంటుంది.

దక్షిణాఫ్రికా డిసెంబర్-జనవరి నెలల్లో ఆస్ట్రేలియా గడ్డ మీద 3 టెస్టులు ఆడనుండగా.. ఫిబ్రవరి-మార్చి నెలల్లో వెస్టిండీస్‌తో సొంత గడ్డ మీద 2 టెస్టులు ఆడ‌బోతుంది.ఇక శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధించడమనేది వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌లో ఆడనున్న రెండు టెస్టుల సిరీస్‌ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. కివీస్‌పై 2-0 తేడాతో గెలిస్తే ఆ జట్టు ఫైనల్ రేసులో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక భారత్ విషయానికి వస్తే.. గత ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడటం వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలను క్లిష్ట‌తరం చేసింది. భారత్ డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. భారత్ మరో ఆరు టెస్టుల ఆడాల్సి ఉండగా.. అందులో 5 టెస్టుల్లో గెలుపొందితేనే ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది. ఇది కొద్దిగా క‌ష్ట‌తరం అనే చెప్పాలి.

Exit mobile version