Overseas Education: భారత విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్లడం సహజమే. అయితే, ఎక్కువగా ఏ దేశాలకు వెళ్తున్నారనే అంశంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. దీనిపై తాజాగా కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఇండియన్స్ స్టూడెంట్స్ తమ గమ్య స్థానాలుగా కొన్ని దేశాలను ఎంచుకుంటున్నారు. అందులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, బ్రిటన్‌కు వెళ్తున్నట్లుగా తేలిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
2022లో 7,50,365 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారని కేంద్ర మంత్రి తెలిపారు. అందులో 1,90,512 మంది అమెరికా, 1,85,955 మంది కెనడా, 1,32,709 మంది యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లినట్లు చెప్పారు. రాజ్యసభలో కేరళ సభ్యుడు జోస్ కె.మణి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకూ ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు వెళ్తున్నారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
విదేశాలకు వెళ్తున్న 68% మంది అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలను ఎంచుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2020, 2021 సంవత్సరాల్లో కలిపి 7,04,208 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారని చెప్పారు. ఒక్క 2022లోనే 7,50,365 మంది వెళ్లారని వివరించారు. మరోవైపు ఈ ఏడాది ఒక్కటే 6.55% మంది అధికంగా విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు. వీటి తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, జర్మనీ, రష్యా, సింగపూర్, కిర్గిస్థాన్, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు ఇండియన్ స్టూడెంట్లు వెళ్తున్నారని వివరించారు.
ఇక కేంద్రం సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ హెల్త్ సర్వీస్ అనే కొత్త అఖిలభారత సర్వీసును తెచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమచారం. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖమంత్రి జితేంద్ర సింగ్ తాజాగా లోక్‌సభలో వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు ప్రతిపాదన వచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
also read:
Chiranjeevi: తనపై కోడిగుడ్లు విసిరారని చెప్పిన చిరంజీవి.. అవాక్కవుతున్న అభిమానులు
Prabhas : మిర్చి జ్ఞాపకాలు.. అనుష్క ప్రభాస్ ని నిజంగా ఎత్తుకుందా ?