ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతికి సాధించుకోవాలని పెద్దలు చెబుతారు. సరిగ్గా ఇదే సామెత నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) కు వర్తించేలా చేశాడు. అవమానాలు పడ్డచోటే గ్రాండ్ విక్టరీతో అదరొట్టాడు. విజయానంతరం గెలిచాను చూడండి… అన్నట్లుగా నిలబడ్డాడు. తర్వాత అక్కడే ముఖంపై టవల్‌తో తుడుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జకోవిచ్. ఇదంతా ఆస్ట్రేలియన్‌లో చోటు చేసుకున్న ఉదంతం.
నొవాక్ జకోవిచ్ ఈసారి తన పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కనబరిచాడు. తన ఇలాఖాలో తిరుగు లేదని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మూడో సెట్ టైబ్రేకర్‌లో సిట్సిపాస్ బంతిని కోర్టు బయటకు కొట్టాడు. తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు.
అయితే, కెరీర్‌లో అతను చూడని గ్రాండ్‌స్లామ్‌లు కాకపోయినా.. అవమానాలు పడ్డచోటే విజేతగా నిలవడం గర్వకారణంగా నిలిచే మూమెంట్. అందుకే అతని కన్నీళ్లలోనూ ఈ కోణం కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
గతేడాది కరోనా ఎఫెక్ట్‌తో క్రీడారంగం కుదేలైంది. జకోవిచ్ వ్యాక్సిన్ వేయించుకోలేదన్న కారణం చూపుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొననివ్వలేదు. ఆడతామని వెళ్లిన అతడిని దేశంలోకి ఎంట్రీ ఇవ్వకుండానే భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
తర్వాత పరిణామాలతో అతడిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు అదే గడ్డపై గర్జించాడు జకోవిచ్. తొడ కండరాల బాధను కూడా అధిగమించి ఛాంపియన్‌గా అవతరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తవమవుతున్నాయి.
తాజా గెలుపుతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేతల్లో అగ్ర స్థానం కైవసం చేసుకొనేందుకు మరో అడుగు పడినట్లయింది. ఇప్పటి వరకు రఫేల్ నాదల్ పేరిట ఉన్న 22 టైటిళ్ల రికార్డును జకోవిచ్ సమం చేశాడు.
గాయాల బారిన పడకుండా ఉంటే త్వరలోనే జరిగే వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో ప్రతిభ చూపి అత్యధిక టైటిళ్ల వేట ఎంతో దూరంలో లేదని నిరూపించే అవకాశం ఉంది.
also read:
Union Budget 2023 : నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు.. బడ్జెట్ షెడ్యూల్ పూర్తి వివరాలివే..