సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un). తాజాగా కనిపించడం లేదనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. రాచరికపాలన సాగిస్తూ.. దేశంలో ధిక్కారస్వరంపై ఉక్కుపాదం మోపే కిమ్.. ఇటీవల 40 రోజుల నుంచి కనిపించడం లేదట. సుమారు నెల రోజులకు పైగా ఆయన బయట ప్రపంచానికి కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. అతిక్రమణలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే కిమ్ గురించి ఈ వార్త హల్ చల్ చేస్తోంది.
ఈ వారంలోనే ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ పరేడ్ జరగబోతోంది. ఈ క్రమంలో దేశాధినేత కనిపించకుండా పోయాడనే వార్తలు కలవరపెడుతున్నాయి. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కిమ్ ఆరోగ్యం బాగోలేదని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనిపించకుండా పోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి.
2014 తర్వాత కిమ్ ఇలా నెల రోజులకు పైగా కనిపించకుండా పోవడం ఇదే తొలిసారి అని చర్చ జరుగుతోంది. కిమ్ అదృశ్యం కావడం వెనుక రహస్యమేంటనేది అంతుచిక్కడం లేదు. తాజాగా ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా కిమ్ హాజరు కాలేదట. రాజధానిలో సైన్యం సైనిక పరేడ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సైన్యం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఉత్తరకొరియా సైనికులు కవాతు చేస్తున్న దృశ్యాలను కమర్షియల్ ఉపగ్రహాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇక సోమవారం జరిగిన మిలటరీ కమిషన్ భేటీకి కిమ్ అధ్యక్షత వహించినట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఎలాంటి ఫొటోలుగానీ, వీడియోలుగానీ విడుదల చేయకపోవడంతో సందేహాలకు ఊతమిస్తోందంటున్నారు. ఈ సమావేశంలో రాజకీయ, సైనిక అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు సాగినట్లు తెలుస్తోంది. యుద్ధానికి మరింత ధీటుగా ప్రిపేర్ అవ్వాలని నిర్ణయాలు జరిగాయని తెలుస్తోంది.
also raed :
victoria gowri : జస్టిస్ LCV గౌరి నియామకంపై దుమారం.. ఎందుకు ?
Telangana : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!