నువ్వులను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. నువ్వుల నుంచి తీసిన నూనెను కూడా మనం వాడుతుంటాం. నువ్వుల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షించి కాంతిని ఇస్తాయి. చర్మంపైన ఉండే పొరను రక్షిస్తాయి. నువ్వుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల నువ్వులు చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వుల నుంచి తీసిన నూనెనే ముందుగా మానవులు వాడడం మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది.
మనిషి నువ్వుల నూనెనే ముందుగా వాడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నువ్వుల నూనెలో మెగ్నిషియం, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, అనేక రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ నువ్వుల పొడిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ పెరుగు వేసి కలపాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేయాలి. కొన్ని చుక్కల తేనె వేసి బాగా కలపాలి. దీంతో ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో కడిగేయాలి. దీని వల్ల ముఖంపై ఉండే రంధ్రాలు మూసుకునిపోతాయి, చర్మానికి తేమ లభిస్తుంది. చర్మం టైట్‌గా మారి కాంతివంతంగా తయారవుతుంది.
1 టీస్పూన్ నువ్వుల పొడిని తీసుకుని అందులో కొన్ని చుక్కల పాలు లేదా తేనె కలిపి ఒక స్క్రబ్ క్రియేట్ చేయాలి. దీన్ని అప్లై చేస్తుంటే ముఖంపై ఉండే మృత చర్మ కణాలు పొతాయి. మురికి, ధూళి, దుమ్ము కూడా పోతాయి. నువ్వుల నూనెను మీరు ముఖానికి నేరుగా కూడా అప్లై చేయవచ్చు. నువ్వుల నూనెను ముఖానికి రాసిన తరువాత కాసేపు ఆగి కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మానికి మెరుపు లాంటి లుక్ వస్తుంది. చర్మం కాంతితో మెరిసిపోతుంది.
అర కప్పు నువ్వుల నూనె, అర కప్పు యాపిల్ సైడర్ వెనిగర్, పావు కప్పు నీళ్లను తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాత్రి పూట రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం టైట్‌గా మారుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది.
2 కప్పుల బ్లాక్ టీనికాచి అందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేయాలి. మిశ్రమాన్ని చల్లార్చిన తరువాత వడకట్టాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరిపాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటెయినర్‌లో నిల్వ చేయాలి. దీన్ని రోజూ ఉదయం క్లీన్సర్‌లాగా వాడుకోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, తేనె కలిపి మిశ్రమంగా చేసి ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాయాలి. కొంత సేపు అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేయాలి. దీంతో చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. ఇలా నువ్వులు లేదా నువ్వుల పొడి, నువ్వుల నూనెను వాడి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.