Telugu Flash News

Rahul Gandhi: కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి.. రాహుల్‌ వ్యాఖ్యలు

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ఓపెనింగ్‌పై రాహుల్‌ స్పందించారు. కొత్త బిల్డింగ్‌ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం అవుతున్న క్రమంలో రాహుల్‌ మాటలు ఆసక్తికరంగా మారాయి. నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ చేతులమీదుగా కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ప్రధానమంత్రి కేవలం ప్రభుత్వానికి మాత్రమే నేతృత్వం వహిస్తారని, రాష్ట్రపతి అలా కాదన్నారు.

రాష్ట్రపతి మొత్తం శాసన వ్యవస్థకు నేతృత్వం వహిస్తారని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలని రాహుల్‌తో పాటు విపక్షాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, ఈనెల 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్‌ తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్‌ చర్చనీయాంశం అవుతోంది.

త్రిభుజాకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోదీ మే 28న ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. 64,500 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ఏరియాతో కొత్త పార్లమెంట్ భవనాన్ని సుందరంగా, అద్భుతంగా నిర్మాణం చేశారు. అయితే, కొత్త భవనం ప్రారంభించే రోజే హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సావర్కర్ జయంతి రోజున జరగనున్న నేపథ్యంలో రాజకీయ రగడకు ఆస్కారం ఏర్పడుతోంది.

స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని కలిశారని, కొత్త భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారని లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ఆ తేదీనే ఎందుకు ప్రారంభించాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 26న దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం.. 75వ ఏడాదిలోకి అడుగిడుతోందని, కొత్త భవనం ఓపెనింగ్‌కు ఇది తగిన సమయమని తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పేర్కొన్నారు.

అయితే, ఇది సావర్కర్ పుట్టినరోజు మే 28న జరుగుతుండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు కొత్త బిల్డింగ్‌ను లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ ఎందుకు ప్రారంభిచరని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నలు గుప్పించారు. మొత్తానికి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై కూడా రాజకీయ రగడ కొనసాగుతోంది.

Read Also : Tirumala: మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

Exit mobile version