Telugu Flash News

Daam: బీ కేర్ ఫుల్‌.. డామ్‌ మాల్‌వేర్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

Daam: కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ మాల్‌ వేర్‌ డామ్‌తో పెనుముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఈ వైరస్‌ మొబైళ్లలోకి చొరబడిందంటే ఇక అంతే సంగతులంటూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సెల్‌ఫోన్లలోకి ఈ వైరస్‌ చొరబడి అతి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేస్తుందని పేర్కొంది. అంతేకాదు.. కాల్‌ రికార్డింగ్‌లు, ఫోన్‌ నంబర్లు, మొబైల్‌ హిస్టరీ, కెమెరాతో పాటు ముఖ్యమైనవన్నీ తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు పంపింది.

ఈ నేపథ్యంలో మొబైల్‌ యూజర్లంతా జాగ్రత్తగా ఉండాలని, అనుమానం ఉన్న లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దని కోరింది. సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను కూడా మాయ చేసి అందుకు అనుగుణంగా రాన్‌సమ్‌వేర్‌ను డెవలప్‌ చేసుకునే సామర్థ్యం ఈ మాల్‌వేర్‌కు ఉంటుందని ది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందం తేల్చింది. సైబర్‌ అటాక్స్‌ను ఎదుర్కొనేందుకు, ఫిషింగ్‌, హ్యాకింగ్‌ల నుంచి సైబర్‌ స్పేస్‌ను కాపాడేందుకు ఈ వింగ్‌ పాటుపడుతోంది.

ఇటీవల మొబైల్‌ వినియోగదారులను మోసగించే సైబర్‌ నేరగాళ్లు పెరిగిపోయారు. అన్‌ వాంటెడ్‌ కాల్స్‌, మెసేజెస్‌ పెరిగాయి. అపరిచిత మెసేజ్‌లను, లింక్‌లను పంపుతూ వాటిని క్లిక్‌ చేసిన వినియోగదారులను బోల్తా కొట్టస్తున్నారు. ఈజీగా వ్యక్తుల డేటాను, బ్యాంకు ఖాతాలను యాక్సిస్‌ చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలపై సైబర్‌ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా ఏదో ఒక మూలన మళ్లీ నేరాలు వెలుగు చూస్తున్నాయి.

ఒకసారి డామ్‌ మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత మొబైల్‌ సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్‌ చేయడం మొదలు పెట్టేస్తుంది. డేటాను చోరీ చేసేందుకు అన్ని విధాలా ట్రై చేస్తుంది. ఒకసారి దాని ప్రయత్నం సక్సెస్‌ అయితే చాలు.. ఫోన్‌లోని రీడింగ్‌ హిస్టరీ, బుక్‌మార్క్స్‌ ఇతర కీలక ఇన్ఫర్మేషన్‌ను క్షణాల్లో దొంగతనం చేసేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెస్‌ను స్టాప్‌ చేస్తుంది. కాల్‌ డేటాను సైతం హ్యాక్‌ చేస్తుందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. డేటా చోరీ అనంతరం దానిని ‘.enc’ ఫార్మాట్‌ ఎన్‌క్రిప్ట్‌ చేసుకుంటుంది. అసలైన డేటాను డిలీట్‌ చేస్తుందని పేర్కొంది. కాబట్టి మొబైల్‌ వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Read Also : ప్రగతి భవన్‌ లో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశం..

Exit mobile version