Telugu Flash News

Nara Lokesh పాదయాత్రలో ఉద్రిక్తత.. వెహికల్స్‌ సీజ్‌ చేసిన పోలీసులు

nara lokesh padayatra

టీడీపీ యువనేత నారా లోకేష్‌ (Nara Lokesh) పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లోకేష్ చేస్తున్న పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయన ప్రచార వాహనాన్ని సీజ్‌ చేశారు. దీంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. కొందరు పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కై టీడీపీ శ్రేణులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోంది.

బంగారుపాలెంలో లోకేష్‌ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మూడు ప్రచార వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఇందులో ఓ సౌండ్‌ సిస్టమ్‌ వెహికల్‌, ప్రచార వాహనం, వీడియో కవరేజీ వెహికల్‌ ఉన్నాయి. వీటిని గంగవరం రూరల్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయానికి పోలీసులు తరలించారు. దీంతో లోకేష్‌ పాదయాత్ర సవ్యంగా సాగేలా టీడీపీ శ్రేణులు మళ్లీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి మైకులు వాడరాదంటూ పోలీసులు లోకేష్‌కు సూచించిన నిబంధనల్లో ఉందని చెబుతున్నారు.

పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. బంగారుపాలెంలో జరిగిన పరిణామాలపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. లోకేష్ పాదయాత్రలో స్థానిక పోలీసులు సహకరించడం లేదని చెప్పారు. బంగారుపాలెంలో లోకేష్ అడుగు పెట్టగానే కరెంటు సరఫరా ఆపేశారని, లోకేష్‌ ప్రచార రథాన్ని సీజ్‌ చేశారని పేర్కొన్నారు. అక్కడి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు టీడీపీ శ్రేణులను హింసిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.

యువగళం వలంటీర్లపై పోలీసులు దాడులు చేస్తున్నారని, తిట్ల దండకం అందుకుంటున్నారని వర్ల రామయ్య వాపోయారు. గజేంద్ర అనే వలంటీర్‌పై పలమనేరు ఇన్‌స్పెక్టర్‌ దాడి చేసి గాయపరిచారని చెప్పారు. కొందరు పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకొనేది లేదని వర్ల రామయ్య హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని వర్ల రామయ్య కోరారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లోనూ లోకేష్‌ పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

also read:

Gym : జిమ్‌కు వెళ్లే ముందు ఫుడ్‌ తీసుకోవాలా? నిపుణులు ఏమంటున్నారంటే!

Pawan Kalyan: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండాల‌నుకున్నాడా..!

Exit mobile version