Telugu Flash News

Nara Lokesh: లోకేష్‌ పాదయాత్రకు సర్వం సిద్ధం.. 100 నియోజకవర్గాలు, 4 వేల కిలోమీటర్లు.. నేడు కీలక ప్రకటన!

nara lokesh padayatra

తెలుగుదేశం పార్టీ యువ నేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ (nara lokesh) ఏపీలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 27న లోకేష్‌ పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రజా వ్యతిరేకత ఉందని, దాన్ని తాము ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైపోయింది. ఓవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రానికి ఇదేం ఖర్మ అనే కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ చంద్రబాబు చాలా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువ నేత నారా లోకేష్‌.. రంగంలోకి దిగుతున్నారు.

ఇప్పటికే లోకేష్‌ పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పార్టీ శ్రేణులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. లోకేష్‌ పాదయాత్రకు ప్రజాగళం అనే పేరు ఖరారు చేసినట్లు కూడా సమాచారం. సుమారు 100 నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర లోకేష్‌ పాదయాత్ర చేయనున్నారట. 2019 ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అయితే, లోకేష్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మొదలు పెట్టి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేదాకా ప్రజల్లో తిరగాలని లోకేష్‌ డిసైడ్‌ అయినట్లు వినికిడి.

కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా..

కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా లోకేష్‌ పాదయాత్ర గురించి దాదాపు ఏడాదిగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మేరకు ఈరోజే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిస్తేజంలో ఉంది. యువతను మేల్కొలిపి వారి ఓట్లన్నీ టీడీపీకే వచ్చేలా లోకేష్‌ ప్రయత్నించనున్నారని సమాచారం. అయితే, సాధారణంగానే లోకేష్ మాటల్లో తడబడుతుంటారు. ఇక ప్రజల్లోకి వెళ్లి మళ్లీ పార్టీకి ఏం డ్యామేజ్‌ చేసిపెడతాడోనని చంద్రబాబు ఒకింత మధనపడుతున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version