Telugu Flash News

Nagaland: 60 ఏళ్ల చరిత్రలో రికార్డు.. నాగాలాండ్‌లో అసెంబ్లీకి మహిళలు..

Salhoutuonuo Kruse and Hekani Jakhalu

Salhoutuonuo Kruse (left) and Hekani Jakhalu

నాగాలాండ్‌ (nagaland) అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రికార్డులు నమోదు అయ్యాయి. సరికొత్త చరిత్రకు నాంది పలికాయి. సుమారు ఆరు దశాబ్దాల తర్వాత అక్కడి శాసనసభలోకి మహిళలు కాలు మోపుతున్నారు. నాగాలాండ్‌ అసెంబ్లీ (nagaland assembly) ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి మహిళగా హెకానీ జఖాలు (Hekani Jakhalu) సంచలనం సృష్టించింది. అనంతరం కాసేపటికే సల్హౌతునో క్రుసే (Salhoutuonuo Kruse) గెలుపొందారు. వీరిరువురూ నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (Nationalist Democratic Progressive Party) అభ్యర్థులుగా పోటీలో నిలిచారు.

దిమాపూర్ నుంచి హెకానీ, వెస్ట్‌ అంగామీ నుంచి క్రుసే ఘన విజయం సాధించారు. ఇక హెకానీ జఖాలూ.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ నుంచి న్యాయ విద్య చదివారు. కొంత కాలం పాటు యూఎస్‌లోనే పని చేసిన ఆమె.. తర్వాత రాజధాని ఢిల్లీకి వచ్చేశారు. లాయర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టారు. తర్వాత సొంత రాష్ట్రం నాగాలాండ్‌కు వెళ్లిన ఆమె.. యూత్‌నెట్‌ అనే ఎన్జీవోను స్టార్ట్‌ చేశారు. రాష్ట్రంలో యువతకు మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉంచేందుకు ఆమె తీవ్రంగా కృషి చేశారు.

యూత్‌నెట్‌ సంస్థ ద్వారా 23,500 మందికి లబ్ధి కలిగించారు. యువత, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషికి 2018లో నారీశక్తి పుస్కారం కూడా లభించడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో ఎల్‌జేపీకి చెందిన అజితో జిమోమిపై ఈమె.. 1,536 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. మరోవైపు సల్హౌతునో క్రుసే హోటల్‌ యజమానిగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి కెనీఝాఖో నఖ్రోపై ఆమె పోటీ చేశారు. ఆమెకు 7,078 ఓట్లు వచ్చాయి. నఖ్రోకు 7,071 మంది ఓట్లు వేశారు. బీజేపీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ, నాగాలాండ్ సీఎం ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడంతో కలిసివచ్చింది.

సుమారు ఆరు దశాబ్దాల కిందట 1963లో నాగాలాండ్‌కు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా దక్కింది. నాటి నుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే, ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా శాసనసభ్యురాలిగా ఎన్నిక కాలేదు. అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ప్రస్తుత ఎన్నికలు మాత్రం రికార్డును తిరగరాశాయి. నాగాలాండ్‌లో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సుమారు సగం 6.56 లక్షల మంది మహిళా ఓటర్లే కావడం విశేషం. 2018లో అత్యధికంగా ఐదుగురు మహిళలు ఎన్నికల్లో బరిలోకి దిగగా.. వారిలో ముగ్గురికి కనీసం ఆరోవంతు ఓట్లు కూడా దక్కకపోవడం గమనార్హం.

also read :

MLC Kavitha : అరెస్టుపై కవిత కౌంటర్.. లిక్కర్ స్కామ్‌పై కీలక వ్యాఖ్యలు!

Bala Krishna: తెలంగాణ యాసలో బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

sobhita dhulipala : అందంగా లేనని వద్దన్నారు.. కానీ ఇప్పుడు..శోభిత కామెంట్స్

 

 

Exit mobile version