కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (MP Komatireddy Venkat Reddy) చాన్నాళ్ల తర్వాత గాంధీ భవన్లో అడుగు పెట్టారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వెంకట్‌రెడ్డి.. ఇటీవల మునుగోడులో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, ఉప ఎన్నిక నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తర్వాత కాంగ్రెస్ గెలవదంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేసి ఇరుకునపడ్డారు. అనంతరం అధిష్టానికి సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.
తాజాగా శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో అడుగు పెట్టిన కోమటరెడ్డి వెంకట్‌రెడ్డి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏ క్షణానైనా కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉందని, పార్టీని సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ వెంకట్‌రెడ్డి రెండుసార్లు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకాలం ఉప్పూ-నిప్పులా ఉండే వీరిద్దరూ రెండుసార్లు సమావేశమై ఏం చర్చించుకున్నారనేది ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే సమయం ఉన్నందున పార్టీలో ముందే 50 నుంచి 60 మంది అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని మాణిక్‌రావ్ ఠాక్రేకు సూచించినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకొనేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెంకట్‌రెడ్డి తెలిపారు. తీరా ఎన్నికల టైమ్ దగ్గరపడిన వేళ హడావుడి చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు వెంకట్‌రెడ్డి.
గాంధీ భవన్‌తో అనుబంధం
వచ్చే ఆరు నెలలు బాగా కష్టపడాలని, ప్రజా పోరాటాలు చేయాలని సూచించినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో మీటింగులు తగ్గించి క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కార్యకర్తల్ని సిద్ధం చేయాలని మాణిక్‌రావ్ ఠాక్రేతో చెప్పానన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెంకట్‌రెడ్డి చెప్పారు. గాంధీ భవన్‌ను రానని తానెప్పుడూ చెప్పలేదని, మూడు దశాబ్దాలుగా గాంధీ భవన్‌తో తనకు అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ కండువాతోనే రాజకీయాలు చేస్తున్నానని తెలిపారు. ఖమ్మం సభలో దేశానికి ఉపయోగపడే విషయాలేవీ చెప్పలేదన్నారు. ఇలాంటి సభలు గతంలో కాంగ్రెస్ చాలా నిర్వహించిందని గుర్తు చేశారు.
also read news:
Google Layoffs : గూగుల్ కీలక నిర్ణయం.. 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన