moral stories in telugu :
పూర్వం ఒక రాజ్యంలో జయభద్రుడు అనే రాజు ఉండేవాడు. అతను చాలా సోమరి. ఎప్పుడూ ఆడుతూ, తింటూ, నిద్రపోతూ ఉంటాడు. ప్రజల గురించి అతనికి ఏ చింతా లేదు. రాజు సోమరిగా ఉండటంతో, ప్రజలు కూడా సోమరులుగా మారారు. ఎవరూ పని చేయడం లేదు. పంటలు పండక ఎండిపోయాయి. దారిద్య్రం పెరిగిపోయింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు.
ఒక రోజు, జయభద్రుడు అడివికి వెళ్ళి దేవుని గురించి తపస్సు చేయగా, దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని ఆడగగా , “నా రాజ్యంలో దారిద్య్రం పెరిగిపోయింది. ప్రజల కష్టాలు తీర్చడానికి నాకు ఒక మంత్రదండం కావాలి” అని కోరాడు. దేవుడు అతనికి ఒక మంత్రదండం ఇచ్చాడు. ఆ మంత్రదండంతో, రాజు ఏది కోరుకున్నా అది వస్తుంది. రాజు ఆనందంగా ఊరంతా చాటింపు వేయించాడు. “ఎవరైనా ఏమైనా కోరుకుంటే, నాకు చెప్పండి. మంత్రదండంతో నేను అది ఇస్తాను” అని చెప్పాడు.
ఒకరోజు, రాజు తన భటులను పంపి, రాజ్యంలోని అందరినీ రాజసౌధానికి రప్పించాడు. భటులను పిలిచి , “రాజసౌధానికి ఇంకా ఎవరైనా రాకుంటే వెళ్లి పిలుచుకురండి” అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్ళారు. ఒక చోట ఒక వ్యక్తి కట్టెలను కొట్టుకుంటూ కనిపించాడు. భటులు కళ్ళెర్ర చేసి, “రాజాజ్ఞను ధిక్కరిస్తావా?” అని అరిచారు. వారు అతనిని పట్టుకుని రాజు వద్దకు ఈడ్చుకుని వచ్చారు. రాజు అతనిని చూసి, “నేను అందరినీ రమ్మన్నాను. నువ్వు రావడం లేదు. ఎందుకు?” అని అడిగాడు.
అతను నవ్వి, “రాజా! నాకు ఏమీ అవసరం లేదు. నా గొడ్డలే నా మంత్రదండం. దీంతో నేను కట్టెలను కొట్టి, అమ్ముకుని, నాకు కావలసినవన్నీ కొనుక్కోగలుగుతున్నాను. నాకు మీ మంత్రదండం అవసరం లేదు” అన్నాడు. రాజు ఆ వ్యక్తి మాటలను విని, తన మంత్రదండాన్ని పైకి విసిరేశాడు. మంత్రదండం మాయమైపోయింది. ఆనాటి నుండి, రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ కష్టపడి పనిచేసి, సంపదలతో తులతూగసాగారు.
నీతి: కష్టపడి పనిచేయడం మంత్రదండం కంటే శక్తివంతం.